నల్లగొండ: జిల్లా ప్రజలు హోలి పండుగను సహజ సిద్ధమైన రంగులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. జిల్లా ప్రజలకు హోలి శుభాకాంక్షలు తెలియజేశారు.
నేడు ఆమనగల్‌కు మంత్రి రాక
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్‌కు రానున్నారు. స్థానికంగా జరిగే శ్రీపార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థాన జాతరలో మంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు చేస్తారు. రాత్రి 7 గంటలకు అమనగల్ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళతారు.
హెచ్‌ఎండీఏ పరిధిలోకి 14 గ్రామాలు
మర్రిగూడ: మర్రిగూడ మండంలోని 14 రెవెన్యూ గ్రామాలు హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలోకి విస్తరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రీజినల్ రింగ్ రోడ్డులో ఆయా గ్రామాలు అంతర్భాంగా ఉన్నట్లు తెలుస్తోంది. విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం మండలంలోని దామెరభీమనపల్లి, బట్లపల్లి, ఇందూర్తి, ఖుదాబక్షపల్లి, కొండూరు, లెంకలపల్లి, మర్రిగూడ, మేటిచందాపురం, సరంపేట, తమ్మడపల్లి, వట్టిపల్లి, భట్లపల్లి, వెంకేపల్లి, యరగండ్లపల్లి గ్రామాలు ఉన్నాయి. కాగా తమకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని మండల అధికారులు అంటున్నారు.
19, 20 తేదీల్లో ‘వికసిత్ భారత్’
రామగిరి(నల్లగొండ): నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఈనెల 19, 20 తేదీల్లో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం జరగనుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి, ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎన్జీ కళాశాలలో కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ సిబ్బంది హరికిషన్, వీరస్వామి, శేఖర్, స్వప్న, వెంకట్‌రెడ్డి, శిరాణి, సావిత్రి, మల్లేశం, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన అవసరం
కనగల్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు చట్టాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీప్తి అన్నారు. గురువారం కనగల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జీసీఈసీ(గర్ల్ చైల్డ్ ఇంప్రుమెంట్ క్లబ్) ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలు, అక్షరాస్యతపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ థామసయ్య, జీసీఈసీ కన్వీనర్ రాధిక పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
నల్లగొండ: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్టియర్ మ్యాథ్స్–1బి, జువాలజీ–1, హిస్టరీ–1 పరీక్షలు జరిగాయి. వీటికి జిల్లావ్యాప్తంగా మొత్తం 13,772 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,171 మంది హాజరయ్యారు. 601 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ దస్రునాయక్ తెలిపారు.
పశువైద్యశాల తనిఖీ
వేములపల్లి(మాడ్గులపల్లి): మాడ్గులపల్లి మండల కేంద్రంలోని పశువైద్యశాలను గురువారం జిల్లా పశువైద్య, పశు సంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ జీవీ.రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల స్టాక్, రికార్డులను పరిశీలించారు. అయితే పశువైద్యశాలలో తహసీల్దార్ కార్యాలయం కూడా నిర్వహిస్తుండడంతో ఏర్పడుతున్న ఇబ్బందులు తెలపడంతో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల పశువైద్యాధికారి వినయ్‌కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
జిల్లా ప్రజలకు మంత్రి హోలి శుభాకాంక్షలు