చికిత్స పొందుతూ మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ మహిళ మృతి

Mar 14 2025 1:13 AM | Updated on Mar 14 2025 1:10 AM

మునుగోడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన జంగ సుజాత(42) తల్లి చీకటిమామిడి గ్రామంలో ఉంటుంది. తన తల్లికి జ్వరం వస్తుండడంతో బుధవారం సుజాత తన కుమారుడితో కలిసి బైక్‌పై తల్లిని మునుగోడులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి చీకటిమామిడికి వెళ్తున్నారు. మార్గమధ్యలో మునుగోడు మండల కేంద్రం పరిధిలోని పత్తి మిల్లు వద్ద గేదెకు ఢీకొట్టి ముగ్గురు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సుజాత తలకు తీవ్రంగా గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

మిర్యాలగూడ అర్బన్‌: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడ పట్టణంలోని శరణ్య గ్రీన్‌ హోమ్స్‌లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. టూ టౌన్‌ సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన బిశ్వజిత్‌ చక్రబోటి(44) గత కొద్ది రోజులుగా బెల్‌ కంపెనీ గెస్ట్‌ హౌజ్‌లో సర్వర్‌గా పని చేస్తున్నాడు. అప్పుల బాధతో మనస్తాపం చెంది గెస్ట్‌ హౌజ్‌లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

యువకుడు అదృశ్యం.. కేసు నమోదు

మిర్యాలగూడ టౌన్‌: మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన యువకుడు అదృశ్యమైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టాపురం గ్రామానికి చెందిన బుర్రి వినయ్‌(23) ఈ నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. స్వగ్రామమైన దామరచర్ల మండలం తెట్టెకుంటలో, బంధువుల ఇళ్లలో కూడా లేకపోవడంతో అతడి భార్య బుర్రి టీనారాణి మిర్యాలగూడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. యువకుడి ఆచూకీ తెలిస్తే 87126 70189, 871267 15151 నంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

మిర్యాలగూడ టౌన్‌: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడేనికి చెందిన మారేపల్లి సైదులు(60) బుధవారం మిర్యాలగూడ మండలం శ్రీనివాస్‌నగర్‌ సమీపంలో గల ఫంక్షన్‌హాల్‌లో తన బంధువుల వివాహానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో జడ్జర్ల–కోదాడ హైవేపై రోడ్డు దాటుతుండగా తుంగపాడు నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బైక్‌ సైదులును ఢీకొట్టింది. అతడికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌ సాయంతో స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమార్తె సట్టు నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రైలు ఎక్కుతుండగా జారిపడిన ప్రయాణికుడు

రక్షించిన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది

భువనగిరి: రైలు ఎక్కే క్రమంలో జారిపడిన వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌) సిబ్బంది రక్షించారు. ఈ ఘటన బుధవారం రాత్రి భువనగిరి రైల్వే స్టేషన్‌లో జరిగింది. భువనగిరి ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బాజిరెడ్డి జగదీష్‌ అనే ప్రయాణికుడు నిజామాబాద్‌కు వెళ్లేందుకు బుధవారం రాత్రి భువనగిరి రైల్వే స్టేషన్‌లో టికెట్‌ తీసుకున్నాడు. రాత్రి 8.22 గంటలకు తిరుపతి నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ రైలు భువనగిరికి చేరుకుంది. రాత్రి 8.23 గంటలకు స్టేషన్‌ నుంచి రైలు కదలగా.. జగదీష్‌ రైలు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో జారిపడ్డాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్‌పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ బాలాజీ గమనించి జగదీష్‌ను బయటకు లాగాడు. దీంతో ఎటువంటి గాయాలు కాలేదు.

చికిత్స పొందుతూ మహిళ మృతి
1
1/1

చికిత్స పొందుతూ మహిళ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement