‘చెత్త’స్టాండ్‌..! | - | Sakshi
Sakshi News home page

‘చెత్త’స్టాండ్‌..!

Jun 25 2026 1:42 AM | Updated on Jun 25 2026 1:42 AM

పాలమూరు బస్టాండులోకి వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే.. శుభ్రం చేయిస్తున్నాం..

ప్రాంగణంలో ఎక్కడబడితే అక్కడే చెత్తాచెదారం దర్శనం

కంపుకొడుతున్న బహిరంగ

మూత్రశాలలు

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయిన

పెద్దనాలా

పట్టించుకోని ఆర్టీసీ, మున్సిపల్‌

కార్పొరేషన్‌ అధికారులు

ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో పరిసరాలను ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్‌ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నాం. పెద్దనాలాతోనే అసలు సమస్య తలెత్తుతోంది. దీనిని శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపల్‌ కార్పొరేషన్‌ పారిశుద్ధ్య సిబ్బందిది. వారంలో రెండుసార్లు వచ్చి ఒకచోట చెత్తాచెదారంతోపాటు పెద్ద కాల్వలోని ప్లాస్టిక్‌ వ్యర్థాలను పోగుచేసి వెళ్లిపోతున్నారు. దీంతో తిరిగి అందులోనే గాలికి కొట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు డంపింగ్‌కు తరలించాలని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు.

– అశోక్‌కుమార్‌, డీఎం, మహబూబ్‌నగర్‌

కొత్త బస్టాండు ప్రాంగణం, డిపో మధ్యలో నుంచి పెద్దనాలా (మురుగు కాల్వ) వెళ్తోంది. ఈ కాల్వ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్‌ కవర్లు, సీసాలతో ఎప్పుడూ నిండిపోయి కనిపిస్తుంది. దీనిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బంది చుట్టుపు చూపులా వచ్చి అప్పుడప్పుడు చెత్తాచెదారం తొలగిస్తుంటారు. అందులోనే జీవనం సాగించే పందులు.. అప్పుడప్పుడు ప్రాంగణంలో సంచరిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు బస్టాండు ఎన్‌హెచ్‌–167కు 5 అడుగుల కిందికి ఉండటంతో వర్షాకాలంలో ప్రాంగణమంతా వరదతోపాటు మురుగు ఏరులై పారుతుంది. భారీ వర్షాలు కురిసిన సందర్భంగా పెద్దనాలా పొంగి పొర్లుతుండటంతో డిపోలోకి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.

ముందుకు కదలని మురుగు..

వాస్తవానికి బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో ఆవరణ, గ్యారేజీ పరిసరాలను నిత్యం శుభ్రం చేయడానికి ఆర్టీసీకి చెందిన కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య సిబ్బంది సుమారు 25 మంది ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారని అధికారులు చెబుతున్నా.. చాలా వరకు పరిసరాలన్నీ అపరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏడాదిన్నర క్రితం నిర్మించిన కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌ సెల్లార్‌ పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయింది. మరోవైపు ఇక్కడి హోటల్‌ నుంచి వెలువడే వ్యర్థ జలాలు మురుగు కాల్వలో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ నిలిచి దుర్గంధభరితంగా మారడంతో ప్రయాణికులు ముక్కు మూసుకుని లోపలికి వస్తూ పోవాల్సి వస్తుంది. అలాగే బహిరంగ మూత్రశాలలు రెండుచోట్ల ఉన్నా కొందరు పెద్ద నాలా వద్దే మూత్రవిసర్జన చేస్తుండటం గమనార్హం. రోజూ సేకరించే చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఆర్టీసీ కాంట్రాక్ట్‌ సిబ్బంది ఇక్కడ ఓ మూలన ఉన్న పెద్ద డస్ట్‌బిన్‌లో వేసేస్తున్నారు. అది నిండిపోయి ఆరుబయట పడినా మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది వచ్చి తీసుకెళ్లడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

‘మొత్తం 18 ప్లాట్‌ఫాంలు కలిగి.. ఉమ్మడి పాలమూరుతోపాటు రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్‌, కర్ణాటక రాష్ట్ర డిపోలతో కలిపి కనీసం 250 బస్సులు.. సుమారు 60 వేల మంది నిత్యం రాకపోకలు సాగించే మహబూబ్‌నగర్‌ కొత్త బస్టాండ్‌ చెత్త ప్రాంగణంగా మారింది. పెద్ద నాలా నుంచి వచ్చే దుర్వాసన, ఆరుబయటే మూత్రవిసర్జన, ఆవరణలో పందుల సంచారం, హోటల్‌ నుంచి వచ్చే వ్యర్థజలాలతో కూడిన కాల్వ, ఎక్కడికక్కడే పేరుకున్న చెత్తాచెదారంతో బస్టాండులోకి వెళ్లే వారు ముక్కు మూసుకోవాల్సి వస్తుందంటే పరిస్థితిని అర్థం చేసుకోచవచ్చు. ఫలితంగా బస్సులు వచ్చే వరకు ప్రాంగణంలో కూర్చోవాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. దుర్గంద భరితమైన వాసన మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.’ – మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement