కందనూలు: ఈ నెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్‌కుమార్‌రెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న పీపీ యూనిట్‌ను ఆయన తనిఖీ నిర్వహించారు. డాక్టర్ సృజన, సిబ్బంది మరియమ్మతో పల్స్ పోలియో కార్యక్రమం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా ఆదివారం పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. అన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్న గర్భిణులకు మెరుగైన సేవలు అందించేందుకు సహాయకారిగా హెల్ప్ డెస్క్ ఉండాలని సూచించారు.
అధిక ఫీజులను అరికట్టాలి
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, వాటిని అఽరికట్టాలని బీఎస్‌ఎఫ్ విద్యార్థి యువజన సంఘం నాయకులు బుధవారం జిల్లా ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మద్దెల బండ సాయిబాబు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలు విద్యార్థుల నుంచి అడ్మిషన్, కళాశాల ఫీజుల పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారు. అయినా అధికారులు తమకేమి పట్టనట్లు నామమాత్రం తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఒకేషనల్ కళాశాల యాజమన్యం ధ్రువపత్రాలతో పాటు ప్రతి దానికి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుభాష్, సాయి, సిద్ధు పాల్గొన్నారు.
పీజీ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో పీజీ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు ఎంబీఏ మొదటి సెమిస్టర్‌లో 42.1, ఎంసీఏ మొదటి సెమిస్టర్‌లో 34.8 ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం పీయూ వెబ్‌సైట్‌ను చూడాలని కంట్రోలర్ ప్రవీణ పేర్కొన్నారు.
ఓపెన్ డిగ్రీ, పీజీ ప్రవేశాలు..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలు ప్రారంభమైనట్లు రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పీజీలో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి కోర్సులు వివిధ లాంగ్వేజెస్‌లో చేరే అవకాశం ఉందని, విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
భవిష్యత్ తరాలపై
నిర్లక్ష్య ధోరణి
వనపర్తి: భవిష్యత్ తరాలపై బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తగదని శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యకు కేటాయించిన బడ్జెట్ కంటే మూడురెట్లు ఎక్కువగా ఉన్నత విద్య పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నా.. ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం విగ్రహాలు, ఆలయాలు, గోపురాలు కట్టడం తప్పా.. గడిచిన దశాబ్ద కాలంలో విద్యాభివృద్ధికి చేసిన ఒక్క ఉన్నత నిర్ణయం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దులు, ఉద్యోగ నియామకాల్లో జాప్యం, పెరుగుతున్న నిరుద్యోగం, విద్యావ్యవస్థలో నెలకొన్న వైఫల్యాలపై విద్యార్థులతో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిచరణ్‌రెడ్డి, తిరుపతయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి బ్రహ్మచారి, నాయకులు బి.కృష్ణ, ధనలక్ష్మి, సుఖేందర్‌రెడ్డి, వాల్యానాయక్, శరవంద, పాండుసాగర్, నందిమళ్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


