అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీఠ వేస్తోందని, సాగునీటి వనరుల అభివృద్ధి ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని చంద్రసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రసాగర్ నుంచి చివరిసారిగా 2009 సంవత్సరంలో నీటిని విడుదల చేయగా.. దాదాపు 17 ఏళ్ల తర్వాత 2026లో కురిసిన భారీ వర్షాలతో చెరువు పూర్తి స్థాయిలో నిండటంతో మళ్లీ నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ నీటి విడుదల ద్వారా సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందించి రైతులకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. నియోజకవరంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అచ్చంపేట లిఫ్టు ద్వారా అచ్చంపేట, అమ్రాబాద్, ఉప్పునుంతల, బల్మూర్, లింగాల మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందన్నారు. ఉమామహేశ్వర రిజర్వాయర్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని, అవసరమైన భూమి సేకరించి, త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. అమ్రాబాద్‌కు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించామని, సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారన్నారు. కార్యక్రమంలో మాజీఎంపీపీ రామనాథం, గోపాల్‌రెడ్డి, కృష్టారెడ్డి, మహిపాల్‌రెడ్డి, బుచ్చిరాములు పాల్గొన్నారు


