కందనూలు: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే బీజేపీ లక్ష్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీతోపాటు ఇండియా కూటమి సభ్యులు అడ్డుకోవడం మహిళలను అవమానపరచడమేనని ఆరోపించారు. వామపక్షాలతోపాటు కుటుంబ పార్టీలు తమ స్వలాభం కోసం మహిళా బిల్లును అడ్డుకోవడం తగదని విమర్శించారు. ఎప్పటికై నా మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడమే బీజేపీ ధ్యేయమన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో మహిళల పాత్ర చాలా కీలకమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును అడ్డుకొని మహిళలకు అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. ఈ నెల 10న హైదరాబాద్‌లో నిర్వహించే ‘జన మహిళా ఆగ్రహ సభ’కు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారని.. జిల్లా నుంచి మహిళలు భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా మీడియా ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేంద్రం, రాము తదితరులు పాల్గొన్నారు.


