ఈసారైనా.. పట్టాలెక్కేనా?!
పరిశ్రమలు కరువు..
ప్రతిసారి పాలమూరుకు దక్కని కేటాయింపులు
● ఏళ్లుగా పెండింగ్‌లోనే గద్వాల–మాచర్ల రైల్వేలైన్
● ఇంకా ప్రారంభం కాని మహబూబ్‌నగర్– డోన్ రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుదీకరణ
● నేటి కేంద్ర బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లావాసుల ఆశలు
మహబూబ్‌నగర్– డోన్ రైల్వే లైన్ డబ్లింగ్‌తోపాటు విద్యుద్దీకరణ పనుల కోసం మూడేళ్ల కింద కేంద్రం రూ.60 కోట్లు కేటాయించింది. అయితే ఈ మేరకు పనులు పూర్తికాలేదు. మేడ్చల్– ముద్ఖేడ్, మహబూబ్‌నగర్– డోన్ సెక్షన్ల మధ్య విద్యుద్దీకరణ కోసం మొత్తం రూ.122.81 కోట్లు అవసరమని అంచనా వేసినా, ఇందుకు అవసరమైన నిధులు కేటాయించలేదు. ఈ మార్గంలో రైల్వే లైన్ డబ్లింగ్‌తోపాటు బైపాస్ లైన్, విద్యుద్దీకరణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించాల్సి ఉంది.
సాక్షి, నాగర్‌కర్నూల్: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈసారైనా ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేటాయింపులు దక్కాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్లకు ఈసారి బడ్జెట్‌లో నిధులు మంజూరవుతాయన్న ఆశలు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలో రవాణా వ్యవస్థ మెరుగుపర్చడంతోపాటు కొత్త రైల్వేలైన్లకు నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే ప్రతిసారి కొత్త రైల్వేలైన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం.. సర్వేలకే పరిమితం చేస్తుండటం నిరాశ కలిగిస్తోంది. కానీ, ఈసారి బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు దక్కుతాయన్న ఆశలు నెలకొన్నాయి.
30 ఏళ్ల నుంచి ప్రతిపాదనలకే..
కృష్ణా– వికారాబాద్– గద్వాల– డోర్నకల్ కొత్త రైల్వే లైన్ నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. నారాయణపేట జిల్లాలోని కృష్ణా నుంచి వికారాబాద్ వరకు 87 కి.మీ., మేర రైల్వే లైన్ కోసం 30 ఏళ్ల కిందట ప్రతిపాదనలు చేశారు. ఇప్పటి వరకు ఐదుసార్లు సర్వే పూర్తిచేసినా పనులు పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు మంజూరుకావడం లేదు.
● గద్వాల– డోర్నకల్ లైన్‌కు 20 ఏళ్ల కిందట రూ.190 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడుసార్లు సర్వే పనులు పూర్తిచేసినా.. బడ్జెట్‌లో మాత్రం కేటాయింపులు దక్కడం లేదు.
● కొత్తగా అచ్చంపేట– మహబూబ్‌నగర్– తాండూరు మార్గంలో సుమారు 180 కి.మీ., కొత్త రైల్వేలైన్ కోసం రూ.360 కోట్లతో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే నిధులు కేటాయించకపోవడంతో ఆ ఆమోదం ప్రతిపాదనలకే పరిమితమైంది.
● గద్వాల– వనపర్తి– నాగర్‌కర్నూల్– గుంటూరులోని మాచర్ల వరకు కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏళ్లుగా కేంద్ర బడ్జెట్‌లో ఈ ఊసే కనిపించడం లేదు.
వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు. పెద్ద సంఖ్యలో స్థానికులకు ఉపాధి కల్పించడంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉపాధి కోసం ఎలాంటి పరిశ్రమలు లేక ఇక్కడి నుంచి పనికోసం హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలసలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో విద్యాభివృద్ధి కోసం అవసరమైన నిధులతోపాటు కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాల్సి ఉంది.
ఈసారైనా.. పట్టాలెక్కేనా?!


