
‘లక్ష్యం మేరకు మొక్కలు నాటండి’
చారకొండ: వన మహోత్సవం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టి మండలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని డీఆర్‌డీఓ చిన్న ఓబులేసు అన్నారు. మండలంలోని జూపల్లిలో బుధవారం పర్యటించిన ఆయన వృద్ధ్యాప పెన్షన్లు అందిస్తున్న పోస్టాఫీను తనిఖీ చేశారు. పోస్టాఫీస్ సేవలు పునరుద్ధరణ సందర్భంగా లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. గతంలో వేలిముద్రతో పింఛన్ పొందే వృద్ధులకు మరింత సులభతరంగా ఐరిస్ ద్వారా సేవలు అందుతున్నాయని తెలిపారు. నూతన సాఫ్ట్‌వేర్ పనిచేసే విధానంపై బీపీఎంను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి, రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం గ్రామంలో నర్సరీని, రహదారి వెంట, కమ్యూనిటీ స్థలాల్లో నాటిన మొక్కలను ఏపీఓ, ఉపాధి అధికారులతో కలిసి పరిశీలించారు. మొత్తం 60 వేల మొక్కలు నాటడంతో పాటు ఇళ్లకు 30 వేల మొక్కలు అందించాలని తెలపారు. కార్యక్రమంలో ఏపీఓ లక్ష్మయ్య, బీపీఎం దేవేందర్, ప్రాథమిక ఉపకేంద్రం వైద్యురాలు ప్రియాంక, ఉపాధి అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.