
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు
అచ్చంపేట రూరల్: పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో శనివారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తారాసింగ్ ఆధ్వర్యంలో వైద్యాధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని 9 ప్రైవేటు ఆస్పత్రులు, 5 డయాగ్నోస్టిక్ సెంటర్లలో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఇతర పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తారాసింగ్ మాట్లాడుతూ తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టు–2010 ప్రకారం నిబంధనలకు లోబడి ప్రైవేటు ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో తప్పనిసరిగా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ధరల పట్టిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వైద్యులు, సిబ్బంది వివరాలు ప్రదర్శించాలని ఆదేశించారు. ఆస్పత్రి వ్యర్థాలను బయో మెడికల్ వేస్టేజ్ మేనేజ్‌మెంట్ వారికి ఇస్తే నిబంధనల ప్రకారం, శాసీ్త్రయ పద్ధతిలో వ్యర్థాలను నిర్మూలిస్తారన్నారు. నిబంధనల ప్రకారం లేని ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.