
విద్యా ప్రమాణాల పెంపు దిశగా..
కందనూలు: సర్కారు బడుల్లో కొంతమంది విద్యార్థులు చదవడం.. రాయడం వంటివి కూడా చేయలేకపోతుండటాన్ని ఇటీవల పలు సర్వేలు వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి పెట్టింది. విద్యార్థుల లోపాలను సరిచేసేందుకు ముందుగా ఉపాధ్యాయులకు తర్పీదు ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా విద్యార్థులు కనీస విద్యా ప్రమాణాల స్థాయికి చేరుకుంటారని ఆశిస్తోంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది.
మూడు విడతల్లో..
వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు బోధనాంశాలపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లాలోని 3,513 మంది ఉపాధ్యాయులకు మూడు విడతల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. మొదటి విడతగా ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు జిల్లాస్థాయిలో మండల రిసోర్స్‌పర్సన్లు, స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. రెండవ విడత ఎస్జీటీలకు 20 నుంచి 24వ తేదీ వరకు, మూడవ విడత 25 నుంచి 30వ తేదీ వరకు మండలస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు కొనసాగుతాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాల పెంపు, కృత్రిమ మేధ (ఏఐ) బోధన, తల్లిదండ్రుల సమావేశం ఇతర అంశాలపై తర్పీదు ఇవ్వనున్నారు.
శిక్షణ ఇలా..
శిక్షణ తరగతుల్లో ఉపాధ్యాయులకు కంటెంట్ ఎర్నిచ్‌మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, లైఫ్ స్కిల్స్, లెర్నింగ్ ఔట్ కం వంటి విషయాలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల నిర్మాణ క్రమాన్ని అర్ధం చేసుకోవడం, అంశాల వారీగా విద్యా ప్రమాణాలపై అవగాహన, బోధనా వ్యూహాల పెంపు, అభ్యసన ప్రక్రియలను సమర్ధవంతంగా తరగతి గదిలో అమలు, ప్రాజెక్టు వర్క్‌ల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు.
జిల్లాలో 3,513 మంది ఉపాధ్యాయులకు శిక్షణ
మూడు విడతల్లో తరగతులు నిర్వహించేలా ప్రణాళిక
ఇప్పటికే మండల రిసోర్స్‌పర్సన్లు,ఎస్‌ఏలకు శిక్షణ పూర్తి
20 నుంచి ఎస్జీటీలకు..