
మల్లన్న చెంతకు..నాలుగు వరుసల రోడ్డు
అచ్చంపేట: మల్లికార్జునస్వామి కొలువై ఉన్న నల్లమల అభయారణ్య ప్రాంతంలో ఆహ్లాదకరమైన ప్రయాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. అన్ని అడ్డంకులను అధిగమించుకొని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 త్వరలోనే నాలుగు వరుసలుగా మారనుంది. రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డును నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేగా త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.2,800 కోట్లతో ఈ రోడ్డును విస్తరిస్తామని, మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి.. పనులు ప్రారంభిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్– డిండి, బ్రాహ్మణపల్లి (మన్ననూర్) 105.6 కి.మీ., గ్రీన్‌ఫీల్డ్ హైవేతో పాటు మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే 6 గంటల ప్రయాణ సమయం 3 గంటలకు తగ్గనుంది. శ్రీశైలం దారిలోని తుక్కుగూడ– డిండి వరకు ఉన్న మిషన్ భగీరథ పైపులైన్‌ను తొలగించే పని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కేంద్రం కోరింది.
హైదరాబాద్– డిండి, మన్ననూర్ రహదారికి మహర్దశ
రూ.2,800 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్–765 నిర్మాణం
మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ ఏర్పాటు
స్వయంగా ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ.. శ్రీశైలానికి తప్పనున్న ప్రయాణ పాట్లు