
నెరవేరని ‘ఉపాధి’ లక్ష్యం
అచ్చంపేట రూరల్: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పశువుల షెడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో గ్రామీణాభివృద్ధి పనులకు ప్రాధాన్యమివ్వగా.. ఈసారి వాటికి భిన్నంగా వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషిచేయాలని భావించింది. వేసవిలో జల సంరక్షణకు ఇంకుడు గుంతలు, చేపల కొలనులతోపాటు పాడి రైతుల కోసం ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు.
నాలుగు పశువులు ఉంటే..
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఉపాధి హామీ జాబ్‌కార్డు కలిగి ఉండి కనీసం నాలుగు పశువులు ఉన్నవారు షెడ్ల నిర్మాణానికి అనుమతిస్తారు. పశువుల షెడ్డుతోపాటు దాని పక్కనే తాగునీటి ట్యాంకు, పశుగ్రాసం నిల్వ చేసుకునేందుకు ప్రత్యేక గదిని సైతం నిర్మించుకోవచ్చు. ఇప్పటి వరకు చిన్న, సన్నకారు రైతులు తమ పశువులను పొలాల వద్ద చెట్ల కింద కట్టేసేవారు. దీంతో వాటి ఆరోగ్యంపై వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపడంతో వ్యాధుల బారినపడేవి. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పశువుల షెడ్ల నిర్మాణానికి అనుమతివ్వడంతో వారి కష్టాలు తీరనున్నాయి.
195 షెడ్ల నిర్మాణానికి..
జిల్లాలోని 20 మండలాల పరిధిలో 195 షెడ్ల నిర్మాణానికి అనుమతి రాగా.. ఇప్పటి వరకు 145 ప్రారంభించారు. అందులో కేవలం 48 మాత్రమే పూర్తిచేయగా.. మిగతా 97 ప్రగతిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించకపోవడంతో షెడ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.84 వేల వరకు కేటాయిస్తున్నారు. నిధులు కేటాయిస్తున్నా.. రైతులకు అవగాహన లేక సద్వినియోగం చేసుకోవడం లేదు. ఫలితంగా జిల్లాలో అనుకున్న స్థాయిలో షెడ్ల నిర్మాణం జరగడం లేదు.
జిల్లాలో నత్తనడకన జీవాల షెడ్ల నిర్మాణం
పనులు ప్రారంభించినా
ముందుకు సాగని వైనం
అవకాశాలున్నా.. అవగాహన
కల్పించని అధికారులు
పథకాలకు నోచుకోలేకపోతున్న రైతులు