
చిన్నారుల ఆరోగ్యంపై నజర్
నాగర్‌కర్నూల్ క్రైం: ఆరేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. వారిలో ప్రాథమిక దశలోనే దృష్టిలోపాలు, మానసిక ఎదుగుదల సమస్యలను నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కంటి పరీక్షలతో పాటు మానసిక సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రత్యేక బృందాలతో 0–6 ఏళ్లలోపు చిన్నారులకు అన్ని పరీక్షలు నిర్వహించి.. అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. దృష్టిలోపం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
జిల్లాలో 47,317 మంది చిన్నారులు..
జిల్లావ్యాప్తంగా 1,131 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. ఆరేళ్లలోపు చిన్నారులు 47,317 మంది ఉన్నారు. తల్లిదండ్రులు, అంగన్‌వాడీ టీచర్ల సమక్షంలో వారికి కంటి పరీక్షలతో పాటు మానసిక ఎదుగుదలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు అంగన్‌వాడీ కేంద్రాలను కంటివైద్య నిపుణులు, ఆర్‌బీఎస్‌కే సంచార ఆరోగ్య బృందాలు సందర్శించి.. చిన్నారుల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే వాటిని పరీక్షిస్తున్నారు. కంటి పరీక్షల కోసం ప్రత్యేకంగా బొమ్మలతో కూడిన చార్ట్ వినియోగిస్తున్నారు. ఈ పరీక్షల్లో కంటిచూపుతో పాటు మెల్లకన్ను, కార్నియా సమస్యలు, కంటి తేమలోపం, పొడిబారి పోవడం వంటి వాటిని ఆఫ్తాలమిక్ వైద్యులు గుర్తిస్తున్నారు. చిన్నారుల్లో దృష్టిలోపాలు ఉంటే.. జిల్లా జనరల్ ఆస్పత్రిలోని కంటి స్పెషలిస్టు వైద్య నిపుణులతో మళ్లీ పరీక్షించి.. తగిన చికిత్సలతో పాటు కంటి అద్దాలను ఉచితంగా అందించనున్నారు. అదే విధంగా ఆర్‌బీఎస్‌కే వైద్యులు చిన్నారుల మానసిక ఎదుగుదల లోపాలను గుర్తిస్తున్నారు. చిన్నారులు సరిగ్గా మాట్లాడుతున్నారా.. ప్రవర్తనలో ఏమైనా అసహజ మార్పు లు, వయసుకు తగ్గుట్టు ఎలా స్పందిస్తున్నారు.. మానసిక ఎదుగుదల మైలురాళ్లను పరీక్షిస్తున్నారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు..
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 10 ప్రత్యేక బృందాలతో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 8 అంగన్‌వాడీ కేంద్రాల్లో 923 మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేశారు. వీరిలో 9మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. మానసిక ఎదుగుదలకు సంబంధించి 45 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1,834 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురు చిన్నారులకు మానసిక ఎదుగుదల సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. వీరిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రులకు రెఫర్ చేశారు.
ప్రత్యేక కార్యాచరణ..
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కంటి పరీక్షలతో పాటు మానసిక ఎదుగుదల సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్స అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ప్రత్యేక శిబిరాల్లో చిన్నారులకు పరీక్షలు చేసేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. దృష్టిలోపం సమస్యలు ఉన్న వారికి అద్దాలు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన చికిత్స అందిస్తాం.
– డా.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ
అంగన్‌వాడీ కేంద్రాల్లో కంటి, మానసిక పరీక్షలు
ఈ నెల7న ప్రత్యేక శిబిరాలు ప్రారంభం
దృష్టిలోపం ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలు
చిన్నారుల మానసిక ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ