నాగర్‌కర్నూల్ క్రైం/ బిజినేపల్లి: వైద్యులు చట్టాలపై అవగాహన పెంచుకుంటే నేర పరిశోధనలో మెడికల్ సర్టిఫికెట్లపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని జిల్లా జడ్జి రాజేష్‌బాబు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఐసీఎఫ్‌ఏఐ లా స్కూల్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులకు శనివారం న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వైద్యులు ఎంతో సేవ చేస్తున్నారని, మెడికల్ లీగల్ నేర పరిశోధనలో మెడికల్ సర్టిఫికెట్ల పాత్రపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోస్టుమార్టం నివేదికతోపాటు వైద్య సంస్థల్లో ర్యాగింగ్ పరిణామాలకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా శిక్షకు గురవడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ చదువు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే చాలా కేసుల్లో వైద్యుల సహాయం అవసరం అవుతుందని చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి మాట్లాడుతూ లెక్చరర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని సద్వినియోగం చేసుకొని భవిష్యత్‌లో ఉన్నత స్థాయిలో స్థిరపడి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సబిత ఎక్‌ఫై లా స్కూల్ ప్రొఫెసర్ దామోదర్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కల్నల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతరావు, సునీల్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కళాశాలలో..
బిజినేపల్లి మండలంలోని వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా జడ్జి రాజేష్‌బాబు మాట్లాడుతూ నేటి సమాజంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు రైతులు సర్టిఫైడ్ చేసిన వాటినే కొనేలా అవగాహన కల్పించాలని, వాటికి రశీదు తప్పనిసరిగా తీసుకునేలా చూడాలన్నారు. తద్వారా ఏదైనా కంపెనీ ద్వారా రైతులకు నష్టం వాటిల్లితే కోర్టులను ఆశ్రయించవచ్చన్నారు. మార్కెట్‌లో ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకు తక్కువగా విక్రయించరాదని, అలా ఎవరైనా కొనుగోలు చేస్తే చట్టపరంగా న్యాయం పొందడంపై జిల్లా న్యాయ సేవా సమితి కార్యదర్శి సబిత వివరించారు. మండలంలోని మంగనూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమాల్లో కళాశాల అసోసియేట్ డీన్ సుధాకర్, శాస్త్రవేత్తలు సత్యనారాయణ, సునీల్ ప్రేమ్, న్యాయవాదులు రవికాంత్‌రావు, దామోదర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, శ్రీరామ్ ఆర్య, పరశురాములు పాల్గొన్నారు.