అచ్చంపేట మున్సిపల్ బడ్జెట్
అచ్చంపేట రూరల్: అచ్చంపేట మున్సిపాలిటీ 2025–26 సంవత్సరానికి సంబంధించి రూ.9,44,70,000లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. శనివారం మున్సిపల్ సమావేశ హాల్‌లో చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కాగా.. 2024– 25లో రూ.10,76,37,000 ప్రవేశపెట్టగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.9,44,70,000తో బడ్జెట్‌ను రూపొందించారు. గతేడాదికన్నా దాదాపు రూ.1,31,67,000 ఆదాయం తక్కువ వస్తుందని అంచనా వేశారు. అంటే సాధారణ పన్నులతోపాటు మొండిబకాయిల వసూళ్లపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుత సంవత్సరం ముగిసే నాటికి రూ.1,44,79,000 మిగులు బడ్జెట్ ఉండగా.. ప్రస్తుత అంచనా బడ్జెట్ రూ.9,44,70,000తో కలిపి రూ.10,89,49,000 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అలాగే ఈ ఏడాది రూ.9,31,60,000 ఖర్చుగా చూయిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.13,10,000 మిగులు చూయించారు. కాగా చర్చోపచర్చల మధ్య బడ్జెట్‌ను అన్ని పార్టీల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
అధికారుల తీరుపై అసంతృప్తి
మున్సిపల్ సమస్యలపై పార్టీలకతీతంగా కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్ గళమెత్తారు. వార్డు సమస్యలతోపాటు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తున్నా కాలనీల్లో అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. కొన్ని వార్డులను చిన్నచూపు చూస్తున్నారని, అన్ని వార్డులకు సమానమైన నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయాలన్నారు. కనీసం కౌన్సిలర్లకు సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. తప్పుల తడకగా బడ్జెట్ నివేదిక తయారు చేశారని.. సమావేశం వాయిదా వేసి మరోరోజు నిర్వహించాలని ప్రతిపక్ష, పాలకపక్ష కౌన్సిలర్లు పట్టుబట్టారు. సమావేశం తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తామని అధికారులు చెప్పారు.
2025–26 ఏడాదికి ప్రవేశపెట్టిన చైర్మన్ శ్రీనివాసులు
చర్చోపచర్చల మధ్య
ఆమోదించిన సభ్యులు


