నాగర్‌కర్నూల్ క్రైం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల వివరాలను ఎలక్ట్రానిక్ హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో పక్కాగా నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓ డా.స్వరాజ్యలక్ష్మి అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలోని పీహెచ్‌సీల సిబ్బందికి ఈ–హెచ్‌ఎంఐఎస్ పోర్టల్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా సదరు రోగి ఏ ఆస్పత్రికి వెళ్లినా ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసే అవకాశం ఉంటుందన్నారు. మొదట అవుట్ పేషెంట్ మాడ్యూల్లో రోగి ఆధార్, ఆయుష్మాన్ భారత్ కార్డు నంబర్ ఎంట్రీ చేయాలని సూచించారు. గుర్తింపు కార్డు లేని రోగులకు మాన్యువల్‌గా వివరాలను నమోదు చేయాలని తెలిపారు. వైద్యాధికారి మాడ్యూల్‌లో రోగుల అనారోగ్య సమస్యలు.. ఏ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఏ మందులు ఎన్ని రోజులు ఇవ్వాలనే వివరాలను నమోదు చేయాలని సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్ మాడ్యూల్‌లో రోగికి చేసిన పరీక్షలు, ఫలితాల వివరాలు పొందుపర్చాలని తెలిపారు. ఫార్మసిస్ట్ మాడ్యూల్లో ఏ రోగికి ఏ మందులు ఎన్ని ఇచ్చారనే వివరాలు ఉండాలన్నారు. రోగుల వివరాలు పోర్టల్‌లో నమోదు చేయడం వల్ల ఏ ప్రాంతంలో ప్రజలు ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. ఏ మందులు ఎక్కువగా వినియోగిస్తున్నారనే వివరాలు తెలుస్తాయని అన్నారు. వ్యాధుల నివారణకు సరైన కార్యాచరణ రూపొందించడానికి సులభతరం అవుతుందన్నారు. రోగులు ఏ ఆస్పత్రికి వెళ్లినా తమ వెంట ఇంతకుముందు చేయించుకున్న చికిత్స వివరాలు, రిపోర్టులు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా.రవికుమార్, ఎఫ్‌ఎంఎస్ సర్వీస్ ఇంజినీరు నరేష్, డీడీఎంలు సందీప్, నవీన, జిల్లా ఫార్మసీ సూపర్‌వైజర్ సురేష్ పాల్గొన్నారు.
ప్రజల్లో చైతన్యం నింపాలి
నాగర్‌కర్నూల్ క్రైం: మూఢ నమ్మకాలు, బాల్యవివాహాలతో ఏర్పడే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు చదువు ప్రాముఖ్యతపై చైతన్యం నింపాల్సిన అవసరం ఉందని అదనపు ఎస్పీ రామేశ్వర్ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ మండలం చందుబట్ల గ్రామంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల ప్రత్యేక శబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. జాతీయ సేవాపథకంలో పాల్గొనడం గొప్ప అవకాశమని.. సామాజిక సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం.అంజయ్య, పంచాయతీ కార్యదర్శి అన్వేష్, కోఆర్డినేటర్ రామకృష్‌ణ్రాావు, కోదండరాములు, దశరథం పాల్గొన్నారు.
రోగుల వివరాలు పక్కాగా నమోదు చేయాలి


