ఆవంచలో రావేఫ్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన
బిజినేపల్లి: నైపుణ్యం అనేది ఒక విభాగంలో ఉంటే సరిపోదని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో వివిధ విభాగాల్లో విజ్ఞానం పెంచుకుని వాటిపై కసరత్తు చేయాలని సామాజిక విజ్ఞాన కళాశాల అసోసియేట్ డీన్ రత్నకుమారి అన్నారు. ముఖ్యంగా మహిళలు వ్యవసాయం ఒకటే కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. సోమవారం తిమ్మాజిపేట మండలంలోని ఆవంచలో వివిధ విభాగాల్లో విజ్ఞాన ప్రదర్శన, పాత వస్తువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు కుట్లు, అల్లికలు, బ్లాక్ ప్రింటింగ్, ఎంబ్రాయిండరి వంటివి నేర్చుకోవాలన్నారు. ఫుడ్‌అండ్ న్యూట్రిషన్ విభాగంలో చిరుధాన్యాలతో ఆధునిక వంటల తయారీలు, నిల్వ వంటి వాటిపై రావేఫ్ విద్యార్థులు అవగాహన కల్పించాలన్నారు. రావేఫ్ విద్యార్థులు కార్యక్రమంలో గ్లాస్ పెయింటింగ్, బాటిల్ పెయింటింగ్, పైన్ మోటారు అభివృద్ధి, గ్రాస్ మోటార్ అభివృద్ధి వంటి వాటిపై ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమంలో పాలెం కేవీకే కో– ఆర్డినేటర్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, సర్పంచ్ అజయ్‌కుమార్, ఏఈఓ సాయిరాం పాల్గొన్నారు.


