మహిళల పేరిట కార్డుల ముద్రణ
ములుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఈ నెలలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌లో లబ్ధిదారులందరికీ పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల పలువురికి కొత్త కార్డులు సైతం మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తం 222 రేషన్ షాపుల పరిధిలో 1,02,378 రేషన్ కార్డులు ఉండగా వారందరికీ స్మార్టు కార్డులు అందనున్నాయి. పౌర సరఫరాల శాఖ కార్డులను ముద్రించి రెవెన్యూ శాఖకు అందజేసింది. మండలాల వారీగా వేరు చేసి తహసీల్దార్లకు ఇచ్చారు. త్వరలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీలోపు లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
ఏళ్లుగా ఎదురుచూపు
పదహారేళ్లుగా నిరుపేదలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా నూతన కార్డులు అందలేదు. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పేదలందరికి రేషన్‌కార్డులు అందాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు లబ్ధిదారులను ఎంపిక చేయటం తప్ప పేదలకు కార్డులు పంపిణీ చేయలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక పలు దఫాలుగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ కార్డులు మాత్రం ఇవ్వలేదు. 2013లో కూపన్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత వాటిని కూడా ఆపేశారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేసినా తెల్లరేషన్ కార్డును తప్పనిసరి చేసింది. దీంతో కార్డు అవసరమైన ప్రతీసారి లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సమస్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇటీవల స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రించింది. సాధారణ కార్డులు కాకుండా స్మార్టు కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.
ఏటీఎం కార్డు తరహాలో..
ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్‌గా రేషన్‌కార్డు ఉంది. కుటుంబ యజమానురాలు ఫొటోను కార్డుపై ముద్రించి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కార్డుపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల పేర్లు వచ్చేలా తయారు చేశారు. ఎంత మంది సభ్యులు ఉన్నారు. ఏయే నెలలో ఎంత రేషన్ తీసుకున్నారు. తదితర వివరాలన్నీ తెలుస్తాయి. భవిష్యత్‌లో అన్ని సంక్షేమ పథకాలకు ఈ కార్డులనే ప్రామాణికం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 10 మండలాలు, ములుగు మున్సిపాలిటీ పరిధిలో 222 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,02,378 కార్డులు ఉండగా 2,92,180 యూనిట్లు ఉన్నాయి. ప్రతినెలా 5,259 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతీ క్వింటాల్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా చార్జీలతో కలిపి కిలోకు రూ.57 వరకు ఖర్చు చేస్తోంది. అయితే కేవైసీ పూర్తి చేసిన వారికే మొదటి విడతలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. మిగతా వారికి కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాతే ఇచ్చే అవకాశం ఉంది.
మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ
వారం రోజుల్లోగా మంత్రి సీతక్క చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ చేసేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాం. స్మార్ట్ కార్డులు మండలాల వారీగా సంబంధిత అధికారులకు అందించాం. మహిళల పేరుపై వచ్చిన స్మార్ట్‌కార్డులు లబ్దిదారులందరికి అందజేస్తాం.
– సయ్యద్ షా ఫైజల్ హుస్సేనీ, డీసీఎస్‌ఓ
●
జిల్లాకు చేరిక.. పంపిణీకి కసరత్తు
మంత్రి సీతక్క చేతుల మీదుగా అందజేసేందుకు ఏర్పాట్లు


