● బస్సులు లేక గంటల తరబడి ఇక్కట్లు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు పడ్డారు. ఏటూరునాగారం బస్టాండ్‌లో వందలాది మంది ప్రయాణికులు బస్సులులేక ఎండలో గంటల తరబడి వేచి చూశారు. రాఖీ పౌర్ణమితో పాటు వరుస సెలవులు రావడంతో హనుమకొండ, హైదరాబాద్‌తో పాటు తదితర పట్టణాల్లో ఉండే మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు స్వగ్రామాలకు చేరుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో ఏటూరునాగారం బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. చుట్టు పక్కల మండలాల నుంచి వచ్చే ప్రయాణికులు సైతం ఏటూరునాగారం బస్టాండ్ చేరుకునే సరికి అక్కడ ఒక్క బస్సు కూడా లేదు. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు
● డీఈఓ సిద్ధార్థరెడ్డి
ములుగు: విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకునేలా ఇన్‌స్పెక్షన్ టీమ్స్ సూచనలు చేయాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి ప్యానల్ ఇన్‌స్పెక్షన్ టీమ్స్ సందర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో ప్యానల్ ఇన్‌స్పెక్షన్ టీమ్స్ సభ్యులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాలలను సందర్శించిన సమయంలో క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు. జాతీయ విద్యావిధానం–2020కు అనుగుణంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్)ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. టీమ్ సభ్యులు పాఠశాలలను సందర్శించినప్పుడు ఉపాధ్యాయులు పూర్తి సహకారం అందించాలని డీఈఓ కోరారు.


