ఐటీడీఏలో అర్జీలు స్వీకరిస్తున్న పీఓ
ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న డీఆర్‌ఓ
● డీఆర్‌ఓ రవికుమార్
ములుగు: ప్రజావాణిలో సమర్పించిన అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సత్వరం పరిష్కరించాలని డీఆర్‌ఓ రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తంగా 33 దరఖాస్తులు రాగా వాటిలో భూ సమస్యలపై 14, ఇందిరమ్మ ఇళ్లు 4, పింఛన్లపై 2, ఇతర శాఖలకు సంబంధించి 13 దరఖాస్తులు వచ్చినట్లు డీఆర్‌ఓ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించినట్లు తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులకు అధికారులు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
గిరిజన దర్బార్‌లో 8 వినతులు
ఏటూరునాగారం: మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన 8 వినతులు రాగా పీఓ లెనిన్ వత్సల్ టొప్పో స్వీకరించారు. వినతుల్లో ప్రధానంగా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరులో పట్టాలో వారసత్వం మార్పిడి చేయాలని గిరిజనుడు విన్నవించారు. వెంకటాపురం(కె) ముత్తారంలోని గిరిజన పాఠశాలల్లో ఏఎన్‌ఎంగా పనిచేసేందుకు అవకాశం కల్పించాలని ఓ గిరిజన మహిళ కోరారు. తాడ్వాయి మండలం బయ్కక్కపేట గ్రామానికి చెందిన ఓ క్రీడాకారుడు పారా నేషనల్ గేమ్స్‌లో పాల్గొనేందుకు ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. అలాగే వివిధ సమస్యలపై వచ్చిన వినతులు పీఓ లెనిన్ వత్సల్ టొప్పో స్వీకరించారు.


