ములుగు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా కె.చండీశ్వరి దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఆమె ములుగు న్యాయ సేవాధికార సంస్థకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. లోక్ అదాలత్‌లు, న్యాయ అవగాహన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా నిర్వహిస్తున్న వివిధ న్యాయ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజలకు అందేలా అధికారులు, సిబ్బంది, ప్యానెల్ న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మై భారత్ వలంటీర్‌గా మమన్‌యాదవ్
ములుగు: మండల పరిధిలోని కాసిందేవిపేట గ్రామానికి చెందిన మేడుదుల మమన్‌యాదవ్ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో నేషనల్ యూత్ వలంటీర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మమన్‌యాదవ్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తూ, యువత అభ్యున్నతికి పాటు పడుతానని వివరించారు. స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేస్తానని వెల్లడించారు.
36 వాహనాలకు వేలం
ములుగు: జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వేర్వేరు కేసుల్లో స్వాధీనం చేసుకున్న 36 వాహనాలకు సోమవారం జిల్లా ప్రొహిబిషన్‌న్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆవరణలో వేలం నిర్వహించారు. ఇందులో 27 వాహనాలను తుక్కుగా, మరో 9 వాహనాలను రోడ్డు వర్తిగా వేలం నిర్వహించారు. తుక్కు వాహనాల ద్వారా రూ.1.30 లక్షలు, రోడ్ వర్తి వాహనాల ద్వారా రూ.1.98 లక్షలు కలిపి మొత్తం రూ.3.28 లక్షలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు ములుగు ఎకై ్సజ్ సీఐ ఎం.సుధీర్ కుమార్ తెలిపారు. అదే విధంగా జీఎస్టీ రూపంలో రూ.59,040 వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు సీఐ వెల్లడించారు.
సంచార జాతుల అభ్యున్నతికి కృషి
ములుగు: సంచార జాతుల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రామ్మోహన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంచార జాతుల విమోచన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచార జాతులు, విముక్తి జాతుల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని తెలిపారు. సంచార జాతుల ప్రజలు తమ పిల్లలను తప్పనిసరిగా విద్యావంతులను చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో ఈ కార్యక్రమంలో సంచార జాతుల జిల్లా అధ్యక్షుడు బాణాల రాజుకుమార్ , పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు ముదురుకోళ్ల సదానందం, వీరభద్రీయ కుల సంఘం ములుగు మండల అధ్యక్షుడు బాణాల శంకర్ పాల్గొన్నారు.


