గోవిందరావుపేట: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవడం లేదు. దీంతో జిల్లాలోని ప్రధాన సరస్సులు, చెరువుల్లో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో లక్నవరం సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 33.6అడుగులు కాగా ప్రస్తుతం 22.1 అడుగుల మేర నీరు ఉంది. నీటినిల్వ క్రమంగా తగ్గుతుండగా పంటలు సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆయకట్టు కింద ఇప్పటికే 5వేల ఎకరాల్లో వరిపంటను సాగుచేశారు. సాగుచేసిన రైతులు నీటి విడుదల కోసం చూస్తున్నారు. అనాధికారికంగా మరో 15వేల ఎకరాల్లో నాట్లు వేసేందుకు రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో సాగునీటి కోసం రైతులు తండ్లాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
గతేడాది నీటితో కళకళ
గతేడాది ఇదే సమయానికి లక్నవరం సరస్సులో 33.6 అడుగుల నీటితో కళకళలాడుతూ నిండుకుండలా ఉంది. ఈ ఏడాది మాత్రం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే నాట్లు వేసిన పొలాల్లో నీరులేక తేమశాతం తగ్గిపోయింది. పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉండడంతో రైతులు పంటలను కాపాడుకోవడానికి నీటి విడుదలపై ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గతంలోనే నీటి విడుదలను నిలిపివేసిన అధికారులు నీటి విడుదలపై ఆలోచనలో పడ్డారు.
నీటి విడుదలపై ఉత్కంఠ
అధికారిక లెక్కల ప్రకారం లక్నవరం చెరువు కింద 8,794 ఎకరాల ఆయకట్టు ఉంది. స్థానికంగా అనాధికారికంగా మరో 15 వేల ఎకరాలకు పైగా సాగు అవుతున్నట్లు అంచనా. సాధారణంగా ఈ సమయానికి ఆయకట్టు పరిధిలో వరినాట్లు పూర్తై రెండో దశ ఎరువులు, పురుగు మందులు పిచికారీ కూడా పూర్తయ్యేది. కానీ ఈసారి వర్షాభావంతో ఇప్పటివరకు సుమారు 5 వేల ఎకరాల్లోనే మాత్రమే నాట్లు పడగా.. వేలాది ఎకరాల్లో నారుమడులు ముదిరిపోవడం, ఎండిపోవడం వంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నాట్లు వేసిన పంటలను కాపాడేందుకు అవసరమైన మేరకు ఒక విడత నీటిని అందించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పరిమితంగా ఉన్న లక్నవరం నీటిని ఇప్పటికే నాట్లు వేసిన పంటలను కాపాడేందుకు వినియోగించాలా.. లేక ఇంకా నాట్లు వేయాల్సిన ప్రాంతాలకు కూడా అందించాలా.. అన్నది అధికారులకు సవాలుగా మారింది. నరసింహుల, కోటగడ్డ, రంగాపురం, శ్రీరాంపతి కాల్వల పరిదిలోని రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా సరస్సులోకి ఇన్‌ఫ్లో లేకపోవడం, నీటి నిల్వ క్రమంగా తగ్గుతుండటంతో నీటి విడుదల విషయంలో అధికారులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
లక్నవరం సరస్సులో
ప్రస్తుత నీటిమట్టం 22.1 అడుగులు
రోజురోజుకూ తగ్గుతున్న నీరు
ఆయకట్టు కింద 5వేల ఎకరాల్లో నాట్లు
సాగునీటిపై రైతుల్లో ఆందోళన
నీటి విడుదలపై అధికారులు
ఆచితూచి అడుగులు


