ములుగు రూరల్: తెలంగాణ రాష్ట్ర విభజన హామీలను సమ్మక్క–సారక్క గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర యూనివర్సిటీల ఇన్‌చార్జ్ రెహమాన్ అన్నారు. ఈ మేరకు శనివారం ఏఐఎస్‌ఎఫ్ 91వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా గిరిజన యూనివర్సిటీ వద్ద సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న గిరిజన యూనివర్సిటీ సమస్యలకు నిలయంగా మారిందన్నారు. కళాశాలలో పూర్తిస్థాయిలో కోర్సులు అందుబాటులో లేవని తెలిపారు. తాత్కాలిక పద్ధతిలో ప్రొఫెసర్లతో విద్యాబోధన చేపడుతున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు విభజన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, కుమ్మరి సాగర్, రాజ్‌కుమార్, ప్రవీణ్, నవీన్, రమేశ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
వాట్సాప్ సేవలు
వినియోగించుకోవాలి
ములుగు రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు వాట్సాప్ చాట్‌బాట్ సేవలను టీజీ ఎన్పీడీసీఎల్ అందుబాటులోకి తీసుకొచ్చిందని సర్కిల్ సూపరింటెండెంట్ భిక్షపతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వినియోగదారులు కార్యాలయాలకు వెళ్లకుండా అవసరమైన సేవలు పొందే విధంగా డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వినియోగదారులు నంబర్‌కు 8712481489 వాట్సాప్‌లో హాయి అని పంపితే అందుబాటులో ఉన్న సేవలు వినియోగించుకోవచ్చని వివరించారు. ఫిర్యాదుల నమోదు, బిల్డింగ్, సర్విస్ కనెక్షన్, సోలార్‌కు సంబంధించిన సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించవచ్చని తెలిపారు. వినియోగదారులు డిజిటల్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.
25 నుంచి
దరఖాస్తుల పరిశీలన
ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లాలోని తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను ఈ నెల 25 నుంచి పరిశీలించనున్నట్లు డీడబ్ల్యూఓ, తాడ్వాయి సీడీపీఓ ప్రేమలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మాత్రమే నిర్ధేశిత తేదీల్లో ఉదయం 10.30 గంటలకు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో స్వయంగా హాజరుకావాలని సూచించారు. గోవిందరావుపేట మండలంలోని అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఈనెల 25న, హెల్పర్ పోస్టులకు వచ్చే నెల 2న, తాడ్వాయి మండలంలోని టీచర్ పోస్టులకు 27న, సెప్టెంబర్ 3న దరఖాస్తుల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్, ఇంటర్, పుట్టిన తేదీ సర్టిఫికెట్, స్థానికత, కులం వంటి తదితర ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సీడీపీఓ ప్రేమలత కోరారు.


