పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

Aug 23 2026 1:34 AM | Updated on Aug 23 2026 1:34 AM

ములుగు: ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, సహాయ ఎన్నికల నమోదు అధికారులు తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలని ఈసీఐ సెక్రటరీ నవీన్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన శనివారం జిల్లాలో పర్యటించారు. ఈ మేరకు వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని పాలంపేట గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాలతో పాటు గోవిందరావుపేట మండలం చల్వాయి పోలింగ్‌ కేంద్రాలను నవీన్‌ కుమార్‌ పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల పరిస్థితి, ఓటర్లకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, బీఎల్‌ఓల పనితీరు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం చల్వాయి గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాల పరిశీలన, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలకు సంబంధించిన అంశాలపై క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నవీన్‌కుమార్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ–2026 పురోగతిపై ఏఈఆర్‌ఓలు, సంబంధిత ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అర్హత కలిగిన ఓటర్లు జాబితాలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్లు, ఎలక్షన్‌ సెల్‌ పర్యవేక్షకులు సలీం, డీటీ నితీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈసీఐ సెక్రటరీ నవీన్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement