ఎస్‌ఎస్‌తాడ్వాయి: వనదేవతల క్షేత్రమైన మేడారంలో సమ్మక్క పూజారులు రెండు రోజుల పాటు నిర్వహించిన పొట్ట పండుగ పూజా కార్యక్రమాలు గురువారంతో ముగిశాయి. బుధవారం ప్రారంభమైన పూజలు గురువారం ఉదయం వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా పూజారులు సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. బుధవారం రాత్రి సమ్మక్క గుడి నుంచి పసుపు, కుంకుమ, అమ్మవారి పూజా సామగ్రితో గద్దెలకు వెళ్లిన పూజారులు రాత్రంతా సంబురాలు చేసుకుని గురువారం ఉదయం గద్దెల నుంచి ఊత కొమ్ముల శబ్ధం, డోలివాయిద్యాలతో సమ్మక్క గుడికి చేరుకున్నారు. పూజారులు గుడికి వస్తున్న దారిలో ఆదివాసీ ఆడపడుచులు ఎదురెల్లి పూజారుల కాళ్లకు పవిత్రమైన జలాలను ఆరగించారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క గద్దె నుంచి పూజారులు బయలుదేరిన సమయంలో భక్తులు, స్థానిక ఆదివాసీ యువతీయువకులు దారి పొడవునా పడుకోవడంతో పూజారులు వారి పైనుంచి దాటి వెళ్లారు. అనంతరం సమ్మక్క గుడిలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి గుడిలో పొట్టకు వచ్చిన మొక్కజొన్న కంకులు, వరి పొట్టను అమ్మవారికి పూజారులు నైవేద్యంగా సమర్పించారు. యాటను బలిచ్చారు. అమ్మవారికి కొత్త ధాన్యాన్ని సమర్పించిన తర్వాత స్వీకరిస్తామని పూజారులు తెలిపారు. రెండు రోజుల పాటు పొట్ట పండుగ పూజా కార్యక్రమాలతో మేడారంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సమ్మక్క పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు సిద్ధబోయిన ముణింధర్, మహేశ్, కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన రాణా రమేశ్, భోజారావు, సిద్ధబోయిన స్వామి, జనార్దన్ పాల్గొన్నారు.
వనదేవతల గద్దెల నుంచి సమ్మక్క గుడికి చేరుకున్న పూజారులు
అమ్మవారికి నైవేద్యంగా వరిపొట్ట, మొక్కజొన్న కంకులు


