ములుగు రూరల్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా వార్షిక ఇండెంట్‌లను పంపించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఆస్పత్రి స్పెషలిస్ట్ విభాగాధిపతులు, ఫార్మసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వైద్య, మౌలిక సౌకర్యాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్‌ఐడీ)సెంట్రల్ మెడిసిన్ స్టోర్ అధికారుల సమన్వయంతో అవసరమయ్యే మందులు, సర్జికల్ మెటీరియల్ నివేదికలు అందించాలన్నారు. ఆస్పత్రిలో అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులు అవసరమయ్యే మందులను కొరత లేకుండా తెప్పించుకోవాలని సూచించారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నుంచి 628 రకాల మందులు, 536 సర్జికల్‌కు సంబంధించిన బకెట్లను పంపిణీ చేస్తుందని వివరించారు. ఈ మేరకు సీఎంఎస్ పుస్తకాలను వైద్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ సీఎంఎస్ ఇన్‌చార్జ్ ఫార్మసీ ఆఫీసర్ భాస్కర్‌రావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ భిక్షపతిరావు, రామ్మోహన్, ఉషారాణి, శ్రీకళ, లక్పతి, సుప్రియ, అనూష, ఫార్మసీ ఆఫీసర్ సుస్మిత, జిల్లా సీఎంఎస్ ఫార్మసీ అధికారి సమ్ములు, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్‌టీఐని బలోపేతం చేయాలని వినతి
ఏటూరునాగారం: ఆర్‌టీఐని బలోపేతం చేయాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నపుండ్రా ప్రసాద్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు తోట రమేశ్‌లు బుధవారం ములుగు కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్‌టీఐ యాక్ట్–2005 చట్టం అమలు పరిరక్షణకు జిల్లా కమిటీలతో పాటు మాని టరింగ్ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు. ప్రతీ కార్యాలయంలో ఆర్టీఐకి సంబంధించి సమాచారం ఇచ్చేందుకు కేటాయించిన అధి కారి పేరు, ఫోన్ నంబర్లు బోర్డుపై ఉండేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఏటూరునాగారం మండల అధ్యక్షుడు బైరెడ్డి మల్లారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్‌కుమార్, భూపాలపల్లి జిల్లా కన్వీనర్ దేవేందర్, భూపాలపల్లి మండల అధ్యక్షుడు శివప్రసాద్ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై
దృష్టి సారించాలి
కన్నాయిగూడెం: పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్ అన్నారు. మండల పరిధిలోని పీహెచ్‌సీని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఆరోగ్యకేంద్రంలో పేదలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి ఓపీ, పరీక్షలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. డ్రగ్ రూమ్‌లో మందుల నిల్వల వివరాలను, సిబ్బంది రిజిస్టర్‌ను పరిశీలించారు. మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు భాస్కర్‌రావు, ఓం ప్రకాశ్, డాక్టర్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
పాముకాటుతో
యువతి మృతి
వాజేడు: మండల పరిధిలోని ఆర్లగూడేంకు చెందిన పాయం శిరీష(25) కట్లపాము కాటు వేయడంతో మృతి చెందింది. బంధువుల కథనం ప్రకారం.. ఆర్లగూడేంకు చెందిన పాయం కృష్ణారావు, జానకీలకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అందులో శిరీష పెద్ద కూతురు. చిన్నకూతురుకు పెళ్లి అయింది. చిన్నకూతురుకు కుమారుడు జన్మించగా 21 రోజుల వేడుకను తల్లిదండ్రుల ఇంట్లో నిర్వహించారు. మంగళవారం రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. ఈ క్రమంలో శిరీషను కట్లపాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఏటూరునాగారం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ములుగుకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి ఆమె మృతి చెందిందని వైద్యులు తెలుపడంతో బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.


