మంగపేట: రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఈ నెల 16న జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శిచుకున్న సీఎం హెలికాప్టర్‌లో ములుగుకు వెళ్లే క్రమంలో హేమాచలక్షేత్రం విశిష్టత, స్వామివారి చరిత్రను ఎంతో ఆసక్తిగా మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. హేమాచలక్షేత్రానిది 16 శతాబ్ధాల చరిత్ర, 60 ఏళ్ల క్రితమే దేవాదాయ ధర్మాదాయ శాఖలో గుర్తింపు పొంది ఉంది. 6 ఏ టెంపుల్‌గా రికార్డుల్లో ఉన్నా గత ప్రభుత్వాలు, పాలకులు, దేవాదాయశాఖ నిర్లక్ష్యం కారణంగా అభివృది నోచుకోని హేమాచలక్షేత్రం అభివృద్ధికి స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ అభివృద్ధిపై మంత్రుల ప్రత్యేక దృష్టి
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పురాతనమైన హేమాచలక్షేత్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది మార్చి 1న మంత్రులు సీతక్క, శ్రీనివాస్‌రెడ్డి ఆలయాన్ని సందర్శించి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న సందర్భంగా హేమాచలక్షేత్ర అభివృద్ధి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి మేడారం తరహాలో అభివృద్ధి చేయిస్తామని హామీనిచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆలయ అభివృద్ధి పనులకు మాస్టర్‌ప్లాన్ నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్, దేవాదాయశాఖ, వివిధ శాఖల అధికారులను ఆదేశించడంతో సుమారు రూ.18 కోట్ల అంచనాతో నివేదికలను రూపొందించారు.
తొలి విడతలో రూ. 3కోట్లు మంజూరు
ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ ముఖ మండపం, వివిధ ప్రతిపాదిత పనులపై ఆర్కిటెక్చర్ల బృందం రూపొందించిన పలు రకాల డిజైనింగ్ మ్యాపులను సీతక్క గత నెల 16న పరిశీలించారు. 2027 జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాలకు ముందే అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించిన విషయం విధితమే. దీంతో పాటు స్వయంగా సీఎం ఆలయ అభివృద్ధికి అవసరమైన మేరకు నిధులు మంజూరు చేస్తానని ప్రకటించడంతో ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ, వివిధ శాఖల అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డి హామీ
ములుగు పర్యనటలో మంత్రులతో
చర్చించిన సీఎం
చిగురిస్తున్న భక్తుల ఆశలు


