ములుగు: నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో మంగళవారం సంయుక్త సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, సాగునీటి లభ్యత, పంటల సాగు పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖల అధికారులు ఒకే వేదికపై చర్చించడం ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను గుర్తించవచ్చన్నారు. అలాగే మే నెల నుంచి ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు పరిస్థితులపై రైతులకు రైతు వేదికలు, ప్రచార మాద్యమాల ద్వారా నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నీటి లభ్యతను అంచనా వేసుకోకుండా పంటలు సాగు చేసి రైతులు నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలలో జిల్లాలో సాధారణ వర్షపాతం 218 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 83 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను రైతులు గమనించి నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులు పూర్తిగా వరి పంటపైనే ఆధారపడకుండా వేరే పంటలకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉద్యానవన పంటల సాగుకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి రైతులకు తగిన సలహాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు సైతం తమ పరిధిలోని రైతులకు నీటి పొదుపు అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, సమ్మయ్య, ఆత్మ కమిటీ జిల్లా చైర్మన్ రఘు, డివిజన్ చైర్మన్లు రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు


