26,77,498 | - | Sakshi
Sakshi News home page

26,77,498

Aug 18 2026 7:22 AM | Updated on Aug 18 2026 7:22 AM

17.08.26 నాటికి ఓటర్లు

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

టర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)తో ఉమ్మడి వరంగల్‌లో రాజకీయ సమీకరణాల కంటే ముందే ఓటర్ల లెక్కల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. జూన్‌ 10న ఉన్న ఓటర్లతో పోలిస్తే సోమవారం నాటి ముసాయిదా ప్రకారం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా ఓటర్ల వివరాలు మారాయి. 30,53,238 మంది ఓటర్లు ఉండగా.. తాజా జాబితాలో 26,77,498 మంది నమోదయ్యారు. అంటే దాదాపు 12.31 శాతం తగ్గుదల కనిపించింది. 3,75,740 మంది ఓటర్లు తగ్గారు. 4,83,803 మంది ఏఎస్‌డీడీ (మరణించినవారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా తరలిపోయినవారు, ఇప్పటికే మరోచోట నమోదైనవారు, ఇతర కేటగిరీ)లలో ఉన్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఓటర్లకు మ్యాపింగ్‌ జరగకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తూర్పులో భారీ మార్పు.. పశ్చిమలో పెద్ద కోత

ఉమ్మడి వరంగల్‌లో అత్యంత ఆసక్తికరమైన గణాంకం వరంగల్‌ పశ్చిమది. జూన్‌ 10న 2,86,335 మంది ఓటర్లు ఉండగా.. సోమవారం నాటికి 2,03,719కు తగ్గారు. అంటే 82,616 మంది తగ్గారు. వరంగల్‌ తూర్పులోనూ దాదాపు ఇదే తరహా పరిస్థితి. 2,60,437 మంది నుంచి ఓటర్ల సంఖ్య 2,09,646కు తగ్గింది. అంటే 50,791 మంది తగ్గారు.

ఏఎస్‌డీడీలో పాలకుర్తి రెండో స్థానం..

ఏఎస్‌డీడీని పరిశీలిస్తే పాలకుర్తి 23.68 శాతంతో ఉమ్మడి వరంగల్‌లో రెండో స్థానం, వరంగల్‌ తూర్పు 23.88 శాతంతో మొదటి స్థానంలో ఉంది. భూపాలపల్లిలో ఏఎస్‌డీడీ ఓటర్ల శాతం కేవలం 8.63 శాతం ఉంది. అంటే ఒకే ఉమ్మడి ప్రాంతంలో నియోజకవర్గాల మధ్య సవరణ ప్రభావంలో గణనీయమైన తేడా కనిపిస్తోంది.

అక్టోబర్‌ 1న తుది జాబితా..

ఇక నుంచి క్లెయిమ్స్‌, అభ్యంతరాలు, విచారణ, కొత్తగా చేరే ఓటర్లు, తిరిగి చేర్చే పేర్లతో జాబితా మారనుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్‌ 1న వెలువడే తుది జాబితానే ఉమ్మడి వరంగల్‌లో అసలు ఓటర్ల బలాన్ని స్పష్టంగా చూపించనుంది. ఇప్పటివరకు కనిపిస్తున్న గణాంకాలు తుది జాబితా కాదన్నదే కీలకం. ప్రత్యేక సవరణలో ముసాయిదా జాబితా అనంతరం ఓటర్లకు తమ పేరు ఉందో లేదో చూసుకునే అవకాశం, అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం ముసాయిదా జాబితాపై క్లెయిమ్స్‌, అభ్యంతరాలకు ఈ నెల 30 వరకు అవకాశం ఉండగా, వాటి పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్‌ 28 వరకు కొనసాగి, తుది ఓటర్ల జాబితా అక్టోబర్‌ 1న ప్రచురించాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం కనిపిస్తున్న తగ్గుదలలో ఎన్ని పేర్లు శాశ్వతంగా తొలగిపోతాయి? ఎన్ని తిరిగి చేరుతాయి? కొత్తగా ఎన్ని పేర్లు చేరతాయి? అనేది త్వరలో తేలనుంది.

రంగంలోకి రాజకీయ పార్టీలు

మరణించిన వారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా తరలిపోయిన వారు, ఇప్పటికే మరోచోట నమోదైన వారు, ఇతర కేటగిరీలు ఏఎస్‌డీడీలో ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. తమ బూత్‌లో తొలగించిన ఓటర్ల జాబితాను తీసుకోవడం, నిజంగా అక్కడే నివసిస్తున్న ఓటర్ల పేర్లు తొలగిపోయాయా? అనేది ఇంటింటికీ పరిశీలించడం. అర్హులైన కొత్త ఓటర్లు, మిస్సైన పేర్లు, చిరునామా/పేరు తప్పులపై క్లెయిమ్స్‌, అభ్యంతరాలు దాఖలు చేయడం. ఇది పార్టీలకు కేవలం రాజకీయ కార్యక్రమం కాదు.. ఎన్నికల బూత్‌ మేనేజ్‌మెంట్‌కు కీలకమైన ప్రక్రియగా మారనుంది.

నియోజకవర్గం 10.06.26 17.08.26 ఏఎస్‌డీడీ ఏఎస్‌డీడీ నో తగ్గిన

ఓటర్లు ఓటర్లు (డిజిటైజ్‌) శాతం మ్యాపింగ్‌ ఓటర్లు

వరంగల్‌ పశ్చిమ 2,86,335 2,03,719 43,892 21.55 46,238 82,616

పరకాల 2,22,679 2,03,598 37,376 18.36 4,568 19,081

వరంగల్‌ తూర్పు 2,60,437 2,09,646 50,058 23.88 25,685 50,791

నర్సంపేట 2,40,244 2,21,913 46,321 20.87 5,559 18,331

వర్ధన్నపేట 2,76,272 2,46,981 53,804 21.78 12,966 29,291

జనగామ 2,49,437 2,22,381 46,000 20.69 9,943 27,056

స్టేషన్‌ఘన్‌పూర్‌ 2,56,806 2,39,750 31,215 13.02 6,746 17,056

పాలకుర్తి 2,61,241 2,41,462 57,177 23.68 12,776 19,779

డోర్నకల్‌ 2,24,165 2,05,085 27,254 13.29 4,715 19,080

మహబూబాబాద్‌ 2,60,770 2,31,871 39,243 16.92 9,687 28,899

భూపాలపల్లి 2,77,882 2,41,964 20,877 8.63 11,739 35,918

ములుగు 2,36,970 2,09,128 30,586 14.63 11,313 27,842

ఉమ్మడి వరంగల్‌ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సవరణ ముసాయిదా ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement