వెంకటాపురం(ఎం) : మండలంలోని రామప్ప దేవాలయంలో సోమవారం శ్రావణ సందడి నెలకొంది. శ్రావణమాసంలో తొలి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ సోమవారం సందర్భంగా రామప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
విద్యార్థులకు చట్టాలపై
అవగాహన ఉండాలి
ములుగు రూరల్ : చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని లీగల్ ఎయిడ్ ఛీప్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం, న్యాయసేవలు, ఉచిత న్యాయం, న్యాయ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందజేస్తున్న న్యాయ సేవలను వినియోగించుకోవాన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ కవిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య, అధ్యాపకులు శిరిష, రాధిక, శంకర్ విద్యార్థులు పాల్గొన్నారు.
మంగపేట : మండలంలోని వివిధ గ్రామాల్లో గల రేషన్ షాపుల్లో కాంటాలను లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ శ్రీలత సోమవారం తనిఖీ చేశారు. గిరిజన సహకార సంస్థ, ప్రైవేటు రేషన్ డీలర్లు, మహిళా పొదుపు సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రేషన్ షాపుల్లో ప్రతి నెలా బియ్యం పంపిణీలో కొందరు నిర్వాహకులు ఎలక్ట్రానిక్ కాంటాలపై అవగాహన ఉన్న వ్యక్తుల సహకారంతో టెక్నాలజీని ఉపయోగించి తూకంలో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కమలాపురం, బోరునర్సాపురంలోని నాలుగు రేషన్ షాపుల్లో ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లను పరిశీలించారు. కమలాపురంలోని ఓ రేషన్ షాపులో తూకంలో తేడా రావడంతో కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.
ప్రజావ్యతిరేక విధానాలు
అవలంబిస్తున్న కాంగ్రెస్
ములుగు : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ములుగు మండల మాజీ అధ్యక్షుడు సానికొమ్ము రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని, రైతు బీమా వెంటనే అమలు చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని వివరించారు. కార్యక్రమంలో చిన్న విజయ్, పోరిక గోవింద్ నాయక్, వెంకన్న, మహేష్, చంద్రమౌళి, ముంజాల భిక్షపతి పాల్గొన్నారు.
అవార్డులకు
దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి అర్బన్: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న అందజేయనున్న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2026లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖాధికారి రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్పెషల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, వలంటీర్ ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరారు.


