గోవిందరావుపేట : ప్రజావాణికి వచ్చే ప్రతీ దరఖాస్తును స్వీకరించి, స్థానికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం గోవిందరావుపేటలో శ్రీకారం చుట్టారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మండలస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించి, వాటి పురోగతిని దరఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. ప్రతీ దరఖాస్తుకి ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు ఒకే సమస్యపై పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా చూడాలన్నారు. ఒంటరి మహిళలు, వితంతువు పింఛను దరఖాస్తులు ఈ నెల 31లోగా స్వీకరించాలని ఆదేశించారు. పస్రా, గోవిందరావుపేట, చల్వాయి ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, తండాలు, గూడేల్లో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.50 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ చిలువేరు వరుణ్ కుమార్ మాట్లాడుతూ.. మండల ప్రజావాణికి మొత్తం 14 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, తహసీల్దార్ సృజన్‌కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


