12 ఏళ్లకు పింఛన్‌ మంజూరు | - | Sakshi
Sakshi News home page

12 ఏళ్లకు పింఛన్‌ మంజూరు

Aug 17 2026 1:41 AM | Updated on Aug 17 2026 1:41 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని లింగాల గ్రామానికి చెందిన ఊకే సాకేత్‌ పుట్టుకతోనే దివ్యాంగుడు. తల్లిదండ్రులు దివ్యాంగుల పింఛన్‌ కోసం ఇంతకాలం ప్రయత్నించినా మంజూరు కాలేదు. మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఆదివారం సాకేత్‌కు అమ్మవార్ల సన్నిధిలో ముఖ్యమంత్రి పింఛన్‌ మంజూరు పత్రాన్ని అందజేశారు. మంత్రి సీతక్క చొరవతో సాకేత్‌కు దివ్యాంగుల పింఛన్‌ మంజూరైందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

‘బుచ్చమ్మకు ఇల్లు

నిర్మించి ఇస్తాం’

ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆదివారం మేడారం వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఆలయ పరిసరాల్లో బారికేడ్ల వెలుపల ఉన్న భక్తులను పలకరించారు. ఈ సందర్భంగా బుచ్చమ్మ అనే మహిళ ముఖ్యమంత్రిని కలిసి తన కుటుంబ పరిస్థితిని వివరించారు. తనకు సొంత ఇల్లు లేక చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని సీఎంకు వివరించారు. ప్రభుత్వం తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుచ్చమ్మ వినతిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆమెకు ఇల్లు నిర్మించి ఇస్తామని హామీనిచ్చారు. ఇందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

బ్రిడ్జి పనుల పరిశీలన

వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి, పెద్దగొళ్లగూడెం గ్రామాల మధ్యన నిర్మిస్తున్న ఇసుక వాగు బ్రిడ్జి పనులను నేషనల్‌ హైవే ఎస్‌ఈ మోహన్‌ ఆదివారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చింది, ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందనే విషయాన్ని అక్కడ పని చేస్తున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

హేమాచలక్షేత్రంలో

దేవాదాయశాఖ కమిషనర్‌

మంగపేట: మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్‌ హన్మంతరావు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ముందుగా హేమాచలక్షేత్రానికి వచ్చి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ఆలయంలోని స్వయంభు స్వామివారికి కమిషనర్‌ గోత్రనామాలతో అర్చనలు జరిపించి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

రోడ్డు ప్రమాదంలో

భక్తులకు గాయాలు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి ఆదివారం వచ్చిన భక్తుల కారు ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం అశ్వాపురం సమీపంలోని మొడికుంటకు చెందిన భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు కారులో మేడారానికి వచ్చారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో మేడారం సమీపంలో కారు అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న రవితేజ, దేవిక, హంసవేణిలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ ఈఎంటీ రజినీకర్‌, పైలెట్‌ గణపతిలు గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement