మంగపేట: మండల పరిధిలోని రామచంద్రునిపేటలో ముత్యాలమ్మ బోనాల పండుగను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. అసలేరు కార్తెలో ముత్యాలమ్మ అమ్మవారికి గ్రామస్తులు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. అసలేరు కార్తె ముగుస్తుండటంతో అత్యంత భక్తిశ్రద్ధలతో మహిళలు డప్పుచప్పుళ్ల మధ్య బోనాలతో ఆలయానికి తరలివెళ్లారు. ముత్యాలమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని, పాడిపంటలు పండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వెంగల బుచ్చిరెడ్డి, గుజ్జ నర్సిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకన్న గ్రామస్తులు పాల్గొన్నారు.


