ములుగు రూరల్: మేడారం మహాజాతరలో భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో ప్రమాదాలకు గురికాకుండా హెచ్చరికలు చేస్తూ, భక్తులకు రక్షణగా ఉంటూ గజ ఈతగాళ్లు సేవలందించారు. సుమారు ఆరు రోజుల పాటు భక్తులకు సేవలందించిన వారికి మత్స్యశాఖ అధికారులు ఒక్కొక్కరికి రోజుకు గౌరవ వేతనం రూ.వెయ్యి చెల్లించాల్సి ఉండగా చెల్లించడంలో గందరగోళం సృష్టిసున్నారు. జాతర సమయంలో విధులు నిర్వర్తించిన మత్స్యశాఖ అధికారి సాల్‌మన్‌రాజ్, ఎఫ్‌ఎఫ్‌ఓ రమేశ్‌లు జిల్లాలోని 64 మత్స్యశాఖ సొసైటీల నుంచి 180 మంది గజఈతగాళ్లను కేటాయించారు. వీరికి భోజన వసతి, లైవ్ జాకెట్లు, టార్చ్‌లు, ట్యూబ్ వంటి సామగ్రిని అందించారు.
రూ.18.89 లక్షల నిధుల విడుదల
ఇటీవల జిల్లా మత్స్యశాఖ అధికారి పదవీ విరమణ పొందగా, ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓను నియమించారు. ఎఫ్‌ఎఫ్‌ఓ రమేశ్ ట్రాన్స్‌ఫర్ అయినప్పటికీ రిలీవ్ కాకుండా జాతర నిధుల్లో నుంచి కొంతమేర డబ్బులు విత్ డ్రా చేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నివేదికలు అందించారు. ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ విధులు నిర్వర్తించడంలేదని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో ఆయన స్థానంలో రజినిని ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓగా నియమించారు. మేడారం జాతర నిధులు రూ.18.89లక్షలు విడుదల కావడంతో జాతర సమయంలో విధులు నిర్వర్తించిన గజ ఈతగాళ్లు కార్యాలయనికి వచ్చి డబ్బులను తీసుకోవాలని తెలియజేశారు. మత్స్యకారులు కార్యాలయానికి వచ్చిన అనంతరం ఆరు రోజులు విధులు నిర్వహిస్తే ఐదు రోజులకు మాత్రమే ఒక్కొక్కరికి రూ.5వేల గౌరవ వేతనం చెల్లించినట్లు తెలిపారు. ప్రశ్నిస్తే మస్టర్‌లో సంతకాలు నాలుగు రోజులకే ఉన్నాయని కానీ ఐదు రోజులకు చెల్లిస్తున్నానని సమాధానం చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
మేడారం మహాజాతరలో జంపన్నవాగు వద్ద ఆరు రోజులు విధులు నిర్వర్తించిన గజ ఈతగాళ్లు
ఐదు రోజులకే డబ్బులు చెల్లిస్తున్న
మత్స్యశాఖ అధికారులు


