ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ బుధవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెలిపాడ్ పనులు, బారికేడ్లు, వీవీఐపీ వేచి ఉండే టెంట్, భద్రతా ఏర్పాట్లతో పాటు పైలాన్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. అధికారులు ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పైలాన్ నిర్మాణంతో పాటు ఇతర పనులను గడువులోగా పూర్తి చేసి, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గట్టమ్మ దేవాలయ పరిసరాల పరిశుభ్రత, సుందరీకరణ, వాహనాల పార్కింగ్ స్థలాలతో పాటు తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న పైలాన్ పనుల పురోగతిని పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే తాడ్వాయి మండల పరిధిలోని మేడారంలో సీఎం పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఆరా తీశారు. హెలిపాడ్, కమాండ్ కంట్రోల్ రూమ్, ఆలయ పరిసరాల్లో చేస్తున్న పనులను కలెక్టర్ సహదేవరావు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి వెళ్లి పరిశీలించారు. సీఎం గిరిజన సంప్రదాయాల ప్రకారం వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నందున ఆశీర్వచనాలు, శేషవస్త్రాల సమర్పణ, మొక్కులు చెల్లింపు తదితర కార్యక్రమాల్లో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్‌తో పరిసరాలను సుందరీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, డీఎస్పీ రవీందర్, మేడారం ఆలయ ఈఓ వీరస్వామి, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు


