భగీరథతో భరోసా | - | Sakshi
Sakshi News home page

భగీరథతో భరోసా

Aug 9 2026 1:58 AM | Updated on Aug 9 2026 1:58 AM

గోవిందరావుపేట: రామప్ప సరస్సు వేలాది కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది. జిల్లాలోని వేలాది కుటుంబాల దాహం తీర్చే తాగునీటి వనరుకు ఆధారం. సరస్సు నుంచి సేకరించిన నీటిని పాలంపేటలోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(డబ్ల్యూటీపీ)లో శుద్ధి చేసి ప్రతిరోజూ 18 మిలియన్‌ లీటర్ల మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండల పరిధిలో గల పాలంపేట గ్రామంలోని డబ్ల్యూటీపీకి రామప్ప సరస్సు ప్రధాన నీటి వనరు. సరస్సులోని నీటిని సేకరించేందుకు ప్రత్యేకంగా ఇన్‌టెక్‌వెల్‌ నిర్మించారు. అక్కడి నుంచి నీటిని ప్లాంట్‌కు తరలించి శాసీ్త్రయ పద్ధతుల్లో శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరా నిర్వహణకు ప్రతినెలా రూ.30.70లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. పాలంపేట డబ్ల్యూటీపీ పరిధి నుంచి జిల్లాలోని ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట మండలాల్లోని 173 జనావాస ప్రాంతాల్లోని 35వేల ఇళ్లకు ఈ ప్లాంట్‌ నుంచి మిషన్‌ భగీరథ నీరు సరఫరా అవుతోంది. ప్లాంట్‌లో శుద్ధి చేసిన నీటిని గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన 197 ఓవర్‌హెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్ల(ఓహెచ్‌ఎస్‌ఆర్‌)కు తరలిస్తారు. అక్కడి నుంచి ఇళ్లకు కుళాయిల ద్వారా తాగునీరు చేరుతోంది.

ఆరు దశల్లో నీటి శుద్ధి

రామప్ప సరస్సు నుంచి వచ్చిన నీటిని నేరుగా ప్రజలకు సరఫరా చేయరు. ముందుగా పాలంపేట డబ్ల్యూటీపీలో ఆరు దశల్లో శుద్ధి చేస్తారు. ఏరేషన్‌తో ప్రారంభమయ్యే ప్రక్రియలో కోగ్యులేషన్‌, ప్రీ క్లోరినేషన్‌, ఫ్లాక్యులేషన్‌, ఫిల్ట్రేషన్‌, చివరగా పోస్ట్‌ క్లోరినేషన్‌ నిర్వహిస్తారు. నీటిలోని మలినాలను తొలగించడం, అవసరమైన రసాయన ప్రక్రియల ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. ఫిల్టర్ల ద్వారా వడపోయడం, అనంతరం క్లోరినేషన్‌ చేయడం వంటి దశలు పూర్తయిన తర్వాతే నీటిని సరఫరా చేస్తూ ప్రజలకు ఆరోగ్యంపై భరోసా కల్పిస్తున్నారు.

నాణ్యతపై నిత్యం నిఘా

ప్రజలకు సరఫరా చేసే నీటి నాణ్యత విషయంలో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. పాలంపేట డబ్ల్యూటీపీలో ప్రతిరోజూ నీటి నాణ్యతను పరీక్షిస్తారు. టర్బీడీటీ, పీహెచ్‌, టీసీఎస్‌, రెసీడ్యూవల్‌ క్లోరిన్‌ వంటి ప్రధాన అంశాలను పరిశీలిస్తారు. నీటిలో మలినాల స్థాయి, నీటి స్వభావం, కరిగిన పదార్థాల పరిమాణం, క్లోరిన్‌ స్థాయి వంటి అంశాలను పరీక్షించిన తర్వాతే సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

మూడు మోటార్లు.. రెండు పంపుహౌస్‌లు

నీటిని శుద్ధి చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు పాలంపేట డబ్ల్యూటీపీలో రెండు పంపుహౌస్‌లు ఉన్నాయి. వీటిలో 100 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మూడు మోటార్లు ఏర్పాటు చేశారు. ప్లాంట్‌ నుంచి శుద్ధి చేసిన నీటిని రిజర్వాయర్లకు పంపింగ్‌ చేయడంలో ఈ మోటార్లు కీలకంగా పని చేస్తున్నాయి.

173 జనావాస ప్రాంతాలు..

35వేల ఇళ్లకు తాగునీరు

రామప్ప సరస్సు నీరు

నాలుగు మండలాలకు సరఫరా

పాలంపేట డబ్ల్యూటీపీలో

నీటి శుద్ధి.. నాణ్యత పరీక్షలు

స్వచ్ఛమైన తాగునీరు

అందించడమే లక్ష్యం

పాలంపేట డబ్ల్యూటీపీ ద్వారా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నీటిని శుద్ధి చేసి ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నాం. విద్యుత్‌ అంతరాయం, పైపులైన్‌ లీకేజీల మరమ్మతుల సమయంలో మాత్రమే కొద్దిసేపు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

పి.సుమన్‌, డీఈ, మిషన్‌ భగీరథ, ములుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement