● జిల్లా ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీఓ కృష్ణవేణి
ములుగు: ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎన్నికల నమోదు అధికారి, ములుగు ఆర్డీఓ కృష్ణవేణి పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం జిల్లా కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కృష్ణవేణి మాట్లాడుతూ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేసేందుకు బీఎల్‌ఓలు ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. వార్డుల వారీగా బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు సమన్వయంతో పనిచేసి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం ములుగు మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ కృష్ణవేణి పరిశీలించారు. సంబంధిత అధికారులకు, బీఎల్‌ఓలకు సూచనలు చేశారు కార్యక్రమంలో తహసీల్దార్ విజయభాస్కర్, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, ఎన్నికల డీటీ సతీష్, మెప్మా ఏడీఎంసీ వహీదా పాల్గొన్నారు.


