అలుపెరుగని పోరాటం | - | Sakshi
Sakshi News home page

అలుపెరుగని పోరాటం

Jun 3 2026 12:57 AM | Updated on Jun 3 2026 12:57 AM

తెలంగాణ ఉద్యమంలో

పార్టీలకతీతంగా ఉద్యమించిన ప్రజలు

సకలజనుల

సమ్మెతో స్తంభించిన ములుగు

రోడ్డెక్కిన ఉపాధ్యాయులు, కళాకారులు, యువత, విద్యార్థులు

పలువురిపై కేసులు నమోదైనా

సంకల్పం కోల్పోకుండా ముందుకు..

ములుగు: త్యాగాల నేల.. పోరాటాల గడ్డ ములుగు ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు అలుపెరుగని పోరాటం చేశారు. ఉద్యమ సమయంలో కళాకారులు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల నాయకులు, యువత, విద్యార్థులు పార్టీలకతీతంగా రోడ్డెక్కి ఉద్యమించారు. పలువురిపై కేసులు నమోదైనప్పటికీ సంకల్పం కోల్పోకుండా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. కవులు, కళా కారులు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. కళాకారుల పాటలే ఉద్యమానికి ఊపిరి అయ్యాయి. డప్పులు చేత పట్టుకొని యువత, విద్యార్థులు కదం తొక్కుతూ పల్లెల నుంచి పట్టణం వరకు తెలంగాణ భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకవెళ్లారు.

సకలజనలు సమ్మెతో ఉద్యమం తీవ్రరూపం

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 2000 సంవత్సరంలో ప్రారంభమైనప్పటికీ 2011లో తీవ్ర రూపం దాల్చింది. 2011 సెప్టెంబర్‌ 13న మొదలైన సకలజనుల సమ్మెలో పార్టీలకతీతంగా నాయకులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, కుల సంఘాలు ఒక్కటై తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లారు. ర్యాలీలు, రాస్తారోకో, నిరహార దీక్షలు, వంటావార్పు, బతుకమ్మలతో మహిళలు ఆటలాడుతూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. ములుగులో నిర్వహించిన సకలజనుల సమ్మెకు ప్రజా గాయకుడు గద్దర్‌ హాజరై ఉద్యమానికి ఊపిరి పోశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఊరురా చైతన్య సదస్సులు నిర్వహించారు. 42 రోజుల పాటు చేసిన సకలజనుల సమ్మెతో జిల్లా స్తంభించిపోయింది. హైదరాబాద్‌లో నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌కు సైతం ములుగు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జిల్లా నుంచి మాజీ మంత్రి దివంగత అజ్మీర చందూలాల్‌, ప్రస్తుత పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క కూడా పాల్గొన్నారు.

ప్రాణత్యాగానికి పాల్పడిన శ్రీనివాస్‌

ములుగు మండలం అబ్బాపూర్‌ గ్రామానికి చెందిన దసరాపు శ్రీనివాస్‌ 2011లో రాష్ట్రం కోసం ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు. రాష్ట్రం ఏర్పడుతుందో లేదోనని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్‌కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాష్ట్ర ఉద్యమంలో అసువులుభాషిన శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు భార్య రజితకు మామునూర్‌ పోలీస్‌ క్యాంపులో ఉద్యోగం కల్పించారు. అతను ఉద్యమ సమయంలో తలపెట్టిన పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.

ఉద్యోగులందరూ భాగస్వాములే..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో ప్రతీ ఉద్యోగి ఉద్యమంలో భాగస్వామిగా మారి ఆందోళనలు నిర్వహించారు. సకల జనుల సమ్మెలో ఉపాధ్యాయ జేఏసీ తరఫున నిరహారదీక్షలు చేపట్టాం. రోడ్డుపై వంటావార్పు, మహిళా ఉద్యోగులతో బతుకమ్మ ఆటలాడుతూ తెలంగాణ ఆకాంక్షను చాటాం. పల్లెల్లో ప్రజా చైతన్య రథంతో తిరిగాం.

– గంట సంజీవరెడ్డి,

మాజీ ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్‌

ఇల్లు వదిలి ఉద్యమాలు చేశాం..

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఇల్లు, వాకిలి వదిలిపెట్టి ఉద్యమాలు చేశాం. 2002లో కామారెడ్డిలో ధూందాం ప్రారంభించి జిల్లాల్లో తిరుగుతూ అనేక కార్యక్రమాలు చేపట్టాం. కళాకారులమంతా బృందాలుగా ఏర్పడి ఉద్యమ ఆకాంక్షను సాంస్కృతిక కళారూపాలతో వివరించాం. అప్పుడు ఉన్న పాలకపక్షాలు బెదిరించినప్పటికీ మొక్కవోని ధైర్యంతో గొంతెత్తి పాటలు పాడాం.

– రేలా విజయ్‌, కవి,గాయకుడు, ములుగు

Advertisement
 
Advertisement
Advertisement