మక్కలు ఫుల్..
ములుగు: జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 19,051 పైగా ఎకరాలలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. ఈ మేరకు అధికారులు జిల్లా వ్యాప్తంగా 4 కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా మక్కల కొనుగోళ్లు నామమాత్రంగా ఉండడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన మక్కలను విక్రయించేందుకు ఇప్పటి వరకు గన్నీ బ్యాగులు కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన మొక్కజొన్న రాశులు పెద్దమొత్తంలో పేరుకుపోతున్నా కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద కాపలా కాస్తూ తమ పంటను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలవరపెడుతున్న మబ్బులు
జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి ఆధ్వాన్నంగా మారింది. ఒకవైపు ఆకాశంలో కమ్ముకుంటున్న మబ్బులు, మరోవైపు పంటను అమ్ముకోవాలన్న తపనతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే పండించిన పంటను నిల్వ చేయడానికి సరైన సౌకర్యాలు లేవు. సాయంత్రం వేళ వచ్చే మబ్బులకు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వర్షాల వల్ల ధాన్యం తడిస్తే నాణ్యత కోల్పోయి గిట్టుబాటు ధర వస్తుందో రాదో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నత్తనడకన కొనుగోళ్లు..
జిల్లాలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో మక్కలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు 20 రోజుల క్రితం తీసుకొచ్చిన మక్కలకు ఇప్పటివరకు గన్నీ బ్యాగులు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. దీంతో దళారులు మక్కల కొనుగోళ్లపై దృష్టిసారించారు. రైతుల పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని తక్కువ ధరకు మక్కలను కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మక్కలకు ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ఇస్తుండగా దళారులు రూ.1,800 నుంచి రూ.1,900లు ఇస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. రైతులు పంటను ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో దళారులు గ్రామాల్లో తిష్టవేసి మక్కల కొనుగోళ్లను వేగవంతం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మక్కల కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో నాలుగు కేంద్రాలను
ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్
20 రోజులుగా కొనుగోలు
కేంద్రాల్లోనే రాశులు
తక్కువ ధరకు దళారులకు
విక్రయిస్తున్న రైతులు
మండలం ఎకరాలు
ములుగు 3,361.14
మల్లంపల్లి 6,312.33
ఎస్‌ఎస్‌తాడ్వాయి 2,972.22
వెంకటాపురం(కె) 2,578.32
వెంకటాపురం(ఎం) 1,528.31
వాజేడు 742.36
మంగపేట 541.07
ఏటూరునాగారం 449.03
కన్నాయిగూడెం 395.29
గోవిందరావుపేట 171.21
మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం తగదు
ములుగు రూరల్: మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పోరిక గోవింద్‌నాయక్ అన్నారు. ఈ మేరకు మల్లంపల్లిలో జాతీయ రహదారిపై రైతులతో కలిసి శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మొక్కజొన్న పంట కోతకోసి 20 రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. దీంతో రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కారణంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఎస్సై ఉపేందర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో అదనపు కలెక్టర్ సంపత్‌రావు సంఘటనా స్థలానికి చేరుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండబోయిన చంద్రయ్య, మాచర్ల ప్రభాకర్, మొర్రి రాజుయాదవ్, సురేశ్, చీదర్ల సంతోష్, రైతులు పాల్గొన్నారు.
కొనుగోళ్లు చేపట్టాలి..
వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడి పంట పండించాను. పంటలను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకవైపు వర్షాల భయం, మరో వైపు పంటను నిల్వ చేసుకునేందుకు సౌకర్యాల లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా అధికారులు స్పందించి మక్కలు కొనుగోలు చేయాలి.
– మొర్రి రాజు యాదవ్, మల్లంపల్లి


