పాకల్లోనే పాఠాలు | - | Sakshi
Sakshi News home page

పాకల్లోనే పాఠాలు

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

కంటైనర్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలని గొత్తికోయల డిమాండ్‌

ఏటూరునాగారం: ఏజెన్సీలోని గొత్తికోయలకు విద్య అందని ద్రాక్షగా మారుతోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చిన గొత్తికోయలకు విద్యా బోధనకు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మంత్రి సీతక్క చొరవతో గుర్రాల బావి, బంగారు పల్లి పాఠశాలలను గుడిసెలో నుంచి కంటైనర్‌ పాఠశాలలోకి మార్చారు. కానీ నూతనంగా గతేడాది మంజూరు చేసిన పాఠశాలలు ఇంకా పాకల్లోనే కొనసాగుతున్నాయి. గతేడాది ఐదు ప్రాథమిక పాఠశాలలు నూతనంగా మంజూరు చేశారు. కాని వాటికి సరైన భవనాలు, పక్కా ఇళ్లు లేక పెంకుటిళ్లు, పాకల్లోనే విద్యాబోధన కొనసాగుతోంది. తాత్కాలిక షెడ్లతో ఇటు వేసవిలో అటు వర్షాకాలంలో కురిసే వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుండెంగవాయి, కొమురం భీమ్‌నగర్‌, రాయబంధంతో పాటు మరో రెండు పాఠశాలలు పాకల్లోనే ఉండడం గమనార్హం. అదే విధంగా మామిడి గూడెంలో రేకుల షెడ్డులో ప్రభుత్వ పాఠశాల కొనసాగుతుండగా పక్కనే ఖాళీ స్థలంలో కంటైనర్‌ పాఠశాలను ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. అందువల్ల రేకుల షెడ్డులోనే కొనసాగడం గమనార్హం.

పట్టించుకోని ప్రభుత్వం

ప్రభుత్వం ఏజెన్సీలో కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడం వరకు బాగానే ఉంది. కానీ వాటి బాగోగులు మాత్రం గాలికి వదిలేసింది. పక్కా భవనాలు లేక గుడిసెలోనే పాఠశాలల నిర్వహణ సాగడం మూలంగా అసౌకర్యాల మధ్య గిరిజనుల చదువులు కొనసాగుతున్నాయి. రిజర్వు ఫారెస్ట్‌ కావడంతో పక్కా భవనాల నిర్మాణం గాలిలో దీపంలా మారాయి. బ్లాక్‌బోర్డులు, తాగునీటి సౌకర్యం, విద్యుత్‌ సరఫరా, క్రీడామైదానం, స్టడీ మెటీరియల్‌ను అందించడం లేదు. ఇప్పటికై నా గిరిజన గూడేల్లో పాకల్లో కొనసాగుతున్న పాఠశాలలకు పక్కా భవనాలు లేక కంటైనర్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. విద్యాశాఖ అధికారులు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.

ఈ ఫొటోలోనిది.. గుండెంగవాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం. ఇక్కడ 1 నుంచి 5 వరకు తరగతి గదులు ఉన్నాయి. 38 మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్‌జీటీ ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించింది. మట్టిగోడల పాఠశాలను చూస్తుంటే ఇంకా మనం ఏకాలంలో ఉన్నామనిపిస్తుంది. కానీ ఇక్కడ విద్యార్థుల చేరికలు పూర్తి స్తాయిలో జరగడం లేదు. విద్యార్థులను పాఠశాలల కు పంపించాలని ఉపాధ్యాయులు ఇంటింటా తిరుగుతున్నా గిరిజనుల్లో సరైన అవగాహన లేక వారి పిల్లలను బడికి పంపడంలో జాప్యం చేస్తున్నారు.

గతేడాది మంజూరైన పాఠశాలలు..

ఇంకా గుడిసెల్లోనే..

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement