ఉగాది భవిష్యత్‌కు పునాది | - | Sakshi
Sakshi News home page

ఉగాది భవిష్యత్‌కు పునాది

Mar 19 2026 8:29 AM | Updated on Mar 19 2026 8:29 AM

ఉగాది భవిష్యత్‌కు పునాది

వేప పువ్వుకు డిమాండ్‌

వేప పూత పులకరింతలు, మామిడి పిందెల పలకరింతలు, మోదుగచెట్ల మధురిమలు. తీరొక్క పూల పరిమళాలు.. నూతనత్వానికి ఆనవాళ్లు.. నూతన సంవత్సరాది వేడుకలు.

– హన్మకొండ కల్చరల్‌

తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఈ పండుగ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. సౌభాగ్యానికి , ప్రేమ, ఆధ్యాత్మిక చింతనకు, పల్లెల్లోని జానపదుల జీవనశైలికి సంకేతంగా నిలుస్తోంది. తెలుగు వారి నూతన సంవత్సం ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈ రోజున కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు ఇష్టపడుతారు. పంచాంగం విని భవిష్యత్‌కు పునాది వేసుకుంటారు. కొత్త మజిలీలను వెతుక్కుంటారు. ‘శ్రీపరాభవ’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నేడు (గురువారం) ఉగాది పర్వదినం జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు.

పచ్చడి ప్రత్యేకత..

కాలాన్ని బట్టి వచ్చే పండుగల్లో ఆయా కాలాల్లో పండించిన వాటిని దేవుడికి నివేదించడం ప్రకృతిపై ప్రేమతో మనిషి ఏర్పర్చుకున్న నియమావళి. అదేవిధంగా చైత్రమాసం నాటికి ప్రజలు తాము కొత్తగా పొందే చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేప పూతను కొత్తకుండలో వేసి పచ్చడిగా చేసి భగవత్‌ నివేదనలుగా సమర్పిస్తారు. తెలంగాణలో ఉగాది పచ్చడిని పానీయంలా చేయడం సంప్రదాయం. దీన్ని షడ్రుచుల సమ్మేళనంగా భావిస్తారు. కానీ నీళ్లలో కలిపి పానీయంగా తాగితే ఎండాకాలంలో మండుటెండల నుంచి రక్షణ పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.

మంగళస్నానం..

కొత్త సంవత్సరంలో కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ శరీరంలోని పాత మురికిని తొలగించుకోవడం కోసం పండుగనాడు విధిగా నువ్వుల నూనెతో శరీరమంతా రుద్దుకొని ఒకగంట ఆగిన తరువాత తలస్నానం చేయాలని పెద్దలు సూచిస్తున్నారు. పండుగనాడు నువ్వుల నూనెతో చేసే స్నానాన్ని మంగళస్నానంగా పిలుస్తుంటారు. మంగళస్నానం ఆచరిస్తే శరీర, మనసులోని మలినం పోతుందని హిందువులు నమ్ముతుంటారు.

వేయిస్తంభాల గుడిలో ప్రత్యేకం..

చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి ఆలయంలో 48 ఏళ్లుగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి మహాన్యాసకపూర్వక పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు, కాళికాపూజ, శ్రీసీతారాముల విగ్రహప్రతిష్ఠాపన పూజలు, భక్తులకు ఆరోగ్య ఐశ్వర్య విద్యశాంతి ఒనగూరాలని సంకల్పిస్తూ సుదర్శన హోమం నిర్వహిస్తున్నట్లు.. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరుగుతుందని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ చెబుతున్నారు. సాయంత్రం సంస్కృత పండితులు సముద్రాల శఠగోపాచార్యులుచే పంచాంగశ్రవణం, కూచిపూడి నృత్యాలు, కవి సమ్మేళనం జరుగుతాయని వేయిస్తంభాల దేవాలయం ఈఓ అనిల్‌కుమార్‌ తెలిపారు.

రోడ్ల రద్దీ..

ఉగాది పండుగను పురస్కరించుకుని పండుగకు కావాల్సిన కొత్త బెల్లం, కొత్త చింతపండు, నోము దండలు, జంద్యాలు, కొత్త కుండలు, దీపాంతలు, వివిధ రకాల పూలు, మోదుగపూలు, మోదుగాకులు, ఇసుక, మర్రి ఊడలు, పసుపు కుంకుమ గంధం, మామిడాకులు తదితర వస్తు సామగ్రి కొనుగోలు చేయడానికి అమ్మడానికి వచ్చిన వారితో నగరంలోని పలు కూడళ్లలో రద్దీ ఏర్పడింది.

పరాభవ సంవత్సరంలో రాజు ‘గురువు’

శ్రీపరాభవ నామ సంవత్సరంలో గురువు రాజుగా, మంత్రిగా కుజగ్రహాలు ఉన్నాయి. ఫలితంగా గురువు రాజైతే పాలకులు కర్మాయుక్తులు, ధర్మయుక్తులు అవుతారు, ప్రభువులు సన్మార్గులు, నీతివేత్తలుగా జీవిస్తారు. ప్రజలు సుభిక్షం, ఆరోగ్యం, సుఖం కలుగుతాయి. మంత్రి కుజుడు కావున అగ్నిచేత దహనాలు, యుద్ధాలు తప్పవు. ఈ సంవత్సరం పాడి అభివృద్ధి, సుగంధ ద్రవాలు, బంగారం, ముత్యాలు, వస్తువుల ధరలు పెరుగుతాయి, రస జాతి వస్తువుల ధరలు తగ్గుతాయి.

– గంగు ఉపేంద్రశర్మ

రుషులు అందించిన

అద్భుత విజ్ఞానమే పంచాంగం..

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలు కలది పంచాంగం. దీన్ని మహా విష్ణుస్వరూపంగా భావించి పూజించాలి. సాయంకాలం పంచాంగ శ్రవణం చేయాలి. నేటి ఆధునిక కాలపు నవీన విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందని కాలంలో భారతీయులు పంచాంగం ద్వారానే కాలగతులు తెలుసుకునేవారు. ఎక్కడో ఉన్న గ్రహాలను వాటి దూరాలను ఎలాంటి టెలిస్కోప్‌ లాంటి ఖగోళ విజ్ఞాన శోధన పరికరాలు లేకుండా భారతీయ మేధావులు సృష్టించిన ఒకానొక అద్భుతమే పంచాంగం.

– డాక్టర్‌ శ్రీఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి, ఆస్ట్రాలజర్‌

పంచాంగ శ్రవణానికి

ముస్తాబైన ఆలయాలు

జిల్లాలో పండుగ వాతావరణం

నేడు వేయిస్తంభాల ఆలయంలో

పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం

బంచ్‌కు రూ.50 పలుకుతున్న ధర

సాక్షి, వరంగల్‌: ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వుకు ఈసారి మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. జిల్లాలోని చాలా మండలాల్లో వేప చెట్లు డైబ్యాక్‌, ట్రీమస్టికో వైరస్‌ బారిన పడడంతో కొమ్మలు మోడువారిపోయాయి. ప్రస్తుతం వేప పువ్వు దొరికే పరిస్థితి లేదు. కానీ ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా వేసుకునే వేప పువ్వుకు ఈసారి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. గ్రేటర్‌ వరంగల్‌లో బుధవారం రూ.20 నుంచి రూ.50 వరకు (చిన్న కట్ట, ఆకులతో కూడుకున్నది) వేప పువ్వును వ్యాపారులు విక్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement