రాబట్టరు.. రాబందులు!
సాక్షిప్రతినిధి, వరంగల్: కీలక శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న కొందరి కక్కుర్తి సర్కారు ఖజానాకు గండి పెడుతోంది. అవినీతికి మరిగిన కొందరు అధికారులు ప్రభుత్వ సొమ్మును అక్రమమార్గం పట్టిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ తరచూ దాడులు నిర్వహిస్తున్నా వారి వైఖరి మారడం లేదు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల వైఖరి ప్రభుత్వ సొమ్మును వ్యాపారులకు ధారాదత్తం చేస్తోంది. రైతులను నుంచి సేకరించిన రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద సరఫరా చేస్తూ.. తిరిగి రాబట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సర్కారు ధాన్యాన్ని బయట అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి ఏసీకే (290 క్వింటాళ్లకు ఒక ఏసీకే)కు రూ.25 వేల వరకు వసూలు చేస్తూ మిన్నకుంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవలే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు ఏసీకేల బియ్యం ఎగవేసిన ఓ వ్యాపారి నుంచి రూ.75 వేల లంచం తీసుకుంటూ సివిల్ సప్లయీస్ డీఎం జీవీ నర్సింహారావు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది.
ఏళ్లు గడుస్తున్నా ఉదాసీనతే..
ఏళ్లు గడుస్తున్నా సీఎంఆర్ రాబట్టడంలో కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. సీఎంఆర్ దందాపై పత్రికల్లో వచ్చినప్పుడో.. లేదా ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లినప్పుడో స్పందిస్తున్న పౌరసరఫరాల శాఖ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇదే క్రమంలో సీఎంఆర్ ఇవ్వని మిల్లుల్లో ఉండే ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధి కారులు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టారు. ఇదే సమయంలో ఇంకా రూ.217 కోట్ల ధాన్యం 31 మంది రైస్‌మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తేల్చినప్పటికీ రాబ ట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవె న్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అ వకాశం ఉన్నా కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఏసీకేల వారీగా వసూళ్లు..
31 మంది రైస్‌మిల్లర్ల నుంచి రూ.217 కోట్ల సీఎంఆర్ ధాన్యం రాబట్టాల్సిన అధికారులు.. వాటి జోలికెళ్లడం లేదు. గత సీజన్‌లో అక్కడక్కడా ఆ డిఫాల్టర్లకే మళ్లీ సీఎంఆర్ ఇచ్చినట్లు ఫిర్యాదులున్నాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్లకు వరకూ వెళ్లినా విచారణ స్థాయి దాటలేదు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఇదిలా ఉంటే బకాయిదారుల నుంచి బియ్యం, ధాన్యం రాబట్టాల్సిన ఉన్నతాధికారులు.. ధాన్యం ఎగవేతదారులతో సంప్రదింపులు జరిపి ఏసీకేకు రూ.25 వేల చొప్పున కొందరి వద్ద ఇటీవల వసూలు చేసినట్లు తెలిసింది. వరంగల్‌కు చెందిన ఇద్దరు రైస్‌మిల్లర్ల లావాదేవీలు నిలిపివేసి పిలిపించిన పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు.. వారం రోజులకే మిల్లును తెరిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో మూడు రైసుమిల్లులకు నోటీసులు ఇచ్చి.. ఐదు రోజుల వ్యవధిలోనే లావాదేవీలకు అనుమతి ఇవ్వడం అప్పట్లో ఆ శాఖలోనే చర్చనీయాంశమైంది. ఈ సీఎంఆర్ దందాలో హస్తలాఘవం చూపుతున్న ఇద్దరు డీఎంలు, ముగ్గురు డీఎస్‌ఓలపై ఏసీబీ అడిషనల్ డీజీపీ, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు తాజాగా ఫిర్యాదులు వెళ్లడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో సీఎంఆర్‌లో అక్రమాలపై ఓ వైపు ఏసీబీ మరో వైపు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగి ఆరా తీస్తుండడం చర్చనీయాంశమవుతోంది.
పౌరసరఫరాల శాఖలో వివాదాస్పదంగా ఇద్దరు డీఎంలు, ఇద్దరు డీఎస్‌ఓల తీరు
సీఎంఆర్ రాబట్టడంలో మీనమేషాలు.. మిల్లర్లను వెనుకేసుకొస్తూ భారీగా నజరానాలు
ఒక్కో ఏసీకేకు రూ.25 వేలకు పైనే..
మిల్లర్ల వద్దే 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
ప్రభుత్వానికి చేరని కస్టమ్ మిల్లింగ్ రైస్.. నాలుగేళ్లుగా పెండింగ్
ఏసీబీ అడిషనల్ డీజీ వరకు ఫిర్యాదులు.. కమిషనర్ పేషీకి సీఎంఆర్ దందా
రంగంలోకి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్.. అక్రమార్కులపై ఏసీబీ ఆరా
రాబట్టరు.. రాబందులు!


