కమీషన్ల కోసమే జాతర పనుల కాలయాపన
● మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: కమీషన్ల కోసమే జాతర అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి ఆరోపించారు. ఆదివారం మేడారం అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరకు వెయ్యికోట్లు ఇస్తామని రూ.117 కోట్లు కేటాయించినా నేటి వరకు పనులు ప్రారంభించలేదన్నారు. జాతర సమయానికి పనులు పూర్తవుతాయో లేదోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జాతర పనులు నత్తనడకన సాగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. మేడారంలో రోడ్డు విస్తరణ, డ్రెయినేజీల నిర్మాణ పనులకు ఇళ్ల ఎదుట రేకుల షెడ్లు, చిరు వ్యాపారుల షెడ్లను తొలగించి పది రోజులు దాటినా పనులు పూర్తి చేయలేదని తెలిపారు. పనుల్లో అలస్యం చేయడంతో చిరు వ్యాపారుల జీవనోపాధిపై దెబ్బపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు నిల్వ నీడ లేకుండా చెట్లను తొలగించారని వెల్లడించారు. గ్రామసభ ఏర్పాటు చేయకుండా చెట్లు కొట్టే అధికారం ఎవరిచ్చారని మండిపడ్డారు. పబ్లిక్ టాయిలెట్లు, ఐటీడీఏ షాపింగ్ కాంప్లెక్స్ లను వాడకంలోకి తీసుకురాకుండా మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గుడి వెనకాల ఉన్న 20ఎకరాల పంట పొలాలపై ప్రభుత్వ కన్ను పడటంపై రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆదివాసీల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, మాజీ జెడ్పీటీసీ రామ సహాయం శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.


