సీతాకోక చిలుకలపై ముగిసిన అధ్యయనం
● జిల్లా అటవీశాఖ అధికారి
రాహుల్ కిషన్ జాదవ్
ఏటూరునాగారం: సీతాకోక చిలుకలపై చేపట్టిన అధ్యయనం ముగిసిందని జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ అన్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు కొనసాగిన సీతాకోకచిలుక, మాత్ సర్వే ముగింపు కార్యక్రమం ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ మాట్లాడుతూ ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యంలో మొట్టమొదటిసారిగా సీతాకోకచిలుక, మాత్ సర్వే చేపట్టినట్లు తెలిపారు. ఇందులో 7 రాష్ట్రాలకు చెందిన పర్యావరణ వేత్తలు, విద్యార్థులతో పాటు సిబ్బంది 60 మంది, ప్రత్యేకమైన ఫొటోగ్రాఫర్లు కలిసి సర్వే చేశారని వివరించారు. ఐసీఏఆర్ నుంచి ఎంటమాలజీ ప్రిన్సిపాల్, సైంటిస్ట్ చిత్ర శంకర్ కీలకమైన రిసోర్స్ పర్సన్‌గా పనిచేశారన్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ప్రశంసపత్రాన్ని అందజేశామని పేర్కొన్నారు. ఈ అభయారణ్యంలో కొన్ని అసాధారణ, అరుదైన సీతాకోకచిలుకలు ఉన్నట్లు అధ్యయనంలో వెలుగుచూశాయన్నారు. సీతాకోకచిలుకల మనుగడను నిర్ధారించడానికి పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సర్వేలు నిర్వహించాలని డీఎఫ్‌ఓ కోరారు. కార్యక్రమంలో ఎఫ్‌డీఓ రమేశ్, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ అధ్యక్షుడు ఇందారం నాగేశ్వర్‌రావు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


