ఆదివారం ఆటవిడుపు..! | - | Sakshi
Sakshi News home page

ఆదివారం ఆటవిడుపు..!

Nov 10 2025 7:24 AM | Updated on Nov 10 2025 7:24 AM

ఆదివా

ఆదివారం ఆటవిడుపు..!

వెంకటాపురం(ఎం)/ఎస్‌ఎస్‌తాడ్వాయి/

మంగపేట/వాజేడు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం వచ్చిందంటే కోలాహలంగా మారిపోతున్నాయి. ఆదివారం ఆటవిడుపు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులతో పాటు వ్యాపారులు పిల్లాపాపలతో తరలివచ్చి ఆనందంగా గడుపుతున్నారు. వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని రామప్ప, మేడారంలోని వనదేవతల దర్శనం, మంగపేటలోని మల్లూరులో గల హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. అలాగే వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో గల బొగత జలపాతానికి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి కొలనులో స్నానాలు చేస్తూ సందడిగా గడుపుతున్నారు.

రామప్పలో ట్రైనీ ఐఏఎస్‌లు

వెంకటాపురం(ఎం) మండల పరిధిలో గల రామప్ప దేవాలయాన్ని ఆదివారం 10 మంది ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప శిల్ప కళ సంపద బాగుందని కొనియాడారు. అదే విధంగా అమెరికా దేశానికి చెందిన ప్రీస్టన్‌ రామప్పను సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

హేమాచలుడి దర్శనానికి నిరీక్షణ

మంగపేట మండల పరిధిలోని మల్లూరు హేమాచల శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచలకొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. గంటల కొద్ది సమయాన్ని లెక్కచేయకుండా వేచి ఉండి మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూపదర్శనం చేసుకుని పులకించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు ఆలయ అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు.

అమ్మవార్లకు మొక్కులు

తాడ్వాయి మండలంలోని మేడారంలో గల సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర, సారె, పూలు, పండ్లు, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు.

బొగతలో ఆనందంగా..

వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో గల బొగత జలపాతం వద్ద ఆదివారం సందర్శకుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో పర్యాటకులు జలపాతానికి తరలివచ్చారు. ప్రకృతి అందాలను వీక్షించి సందడి చేశారు. జిప్‌లైన్‌పై ఆటలాడుకుని సరదాగా గడిపారు. సమీప కొలనులో స్నానాలు చేసి కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు.

ఆదివారం ఆటవిడుపు..!1
1/2

ఆదివారం ఆటవిడుపు..!

ఆదివారం ఆటవిడుపు..!2
2/2

ఆదివారం ఆటవిడుపు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement