Rewind 2021: వేడుకలు.. విషాదాలు...

Year Ender 2021: Celebrity Marraige And Deaths In 2021 - Sakshi

2021 కొందరిని ఒక ఇంటివారిని చేసింది. కొందరిని ఈ లోకానికి దూరం చేసింది. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటలు, హఠాన్మరణంతో షాక్‌కి గురి చేసిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం.

పెళ్లి సందడి
2021లో పెళ్లి సందడి కనిపించింది. హీరోలు కార్తికేయ, సుమంత్‌ అశ్విన్, హీరోయిన్‌ ప్రణీత, సింగర్‌ సునీత వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి.  

♦ ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. నవంబరు 21న తన ప్రేయసి లోహితతో ఏడడుగులు వేశారు. వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ చేస్తున్నప్పుడు తొలిసారి (2010) లోహితను కలిశారు కార్తికేయ. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది.

♦ ప్రముఖ దర్శక–నిర్మాత ఎమ్మెస్‌ రాజు తనయుడు, హీరో సుమంత్‌ అశ్విన్‌ ఫిబ్రవరి 13న దీపిక మెడలో మూడు ముడులు వేశారు. అమెరికాలోని డల్లాలో రీసెర్చ్‌ సైంటిస్ట్‌గా చేస్తున్నారు దీపిక. సుమంత్, దీపికలది పెద్దలు కుదిర్చిన వివాహం. 

♦ ‘అత్తారింటికి దారేది’ ఫేమ్‌ ప్రణీత కూడా ఈ ఏడాది అత్తారింటిలోకి అడుగుపెట్టారు. మే 30న వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో ఆమె వివాహం జరిగింది. బెంగళూరులో నితిన్‌ రాజు వ్యవసాయ క్షేత్రంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ‘మాది లవ్‌ కమ్‌ అరేంజ్డ్‌ మ్యారేజ్‌’ అన్నారు ప్రణీత.  

♦ ప్రముఖ గాయని సునీత ఈ ఏడాది ప్రారంభంలో రామ్‌ వీరపనేనితో ఏడడుగులు వేశారు. జనవరి 9న వీరి పెళ్లి శంషాబాద్‌ సమీపంలోని రామాలయంలో జరిగింది.

♦ హాస్య నటి విద్యాల్లేఖా రామన్‌ పెళ్లి సెప్టెంబర్‌ 9న సంజయ్‌తో జరిగింది. ఫిట్‌నెస్, న్యూట్రషనిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌గా చేస్తున్నారు సంజయ్‌. వీరిది ప్రేమ వివాహం. కాగా, పెళ్లి జరిగిన విషయాన్ని కొన్ని రోజులకు ‘మా పెళ్లయింది’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలు షేర్‌ చేశారు విద్యుల్లేఖా రామన్‌. 

ఇక సెలవు 
తెలుగు పరిశ్రమలో ఈ ఏడాది బోలెడు విషాదాలు నెలకొన్నాయి. కొందరు కరోనాతో, మరికొందరు అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి ‘ఇక సెలవు’ అంటూ షాకిచ్చారు. 

ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి నవంబర్‌ 30న ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్యదర్శకులు శివ శంకర్‌ మాస్టర్‌ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ నవంబర్‌ 28న మృతి చెందారు. అదే విధంగా గాయకుడు జి. ఆనంద్‌ మే 7న, స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ మోహన్‌ మే 7న, రచయిత నంద్యాల రవి మే 14న, నటుడు, జర్నలిస్ట్‌ టీఎన్‌ఆర్‌ మే 10న, డైరెక్టర్‌ అక్కినేని వినయ్‌ కుమార్‌ మే 12న, డబ్బింగ్‌ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వి. కాంచన్‌ బాబు వంటి వారిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది.

అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్‌ చంద్రశేఖర్‌ మే 12న, నిర్మాత, సీనియర్‌ జర్నలిస్ట్‌ బీఏ రాజు మే 21న, నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ మే 26న, యువ నిర్మాత మహేశ్‌ కోనేరు అక్టోబర్‌ 12న గుండెపోటుతో మృతి చెందారు. ప్రముఖ నిర్మాత ఆర్‌ఆర్‌ వెంకట్‌ సెప్టెంబరు 27న కిడ్నీ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. అదే విధంగా డైరెక్టర్‌ గిరిధర్‌ (శుభ ముహూర్తం) ఆగస్టు 2న, నటుడు రాజాబాబు అక్టోబర్‌ 25న అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top