ఊరంతా గర్వపడేలా సినిమా తీశారు! | Local Youth Turn Their Dream Into Reality With Self Made Crime Thriller Red File, Earns Cheers From Local Audience | Sakshi
Sakshi News home page

ఊరంతా గర్వపడేలా సినిమా తీశారు!

Jul 9 2026 10:07 AM | Updated on Jul 9 2026 10:13 AM

Village Youth Make Film And Win Hearts Of Local Audience

సినిమా అంటే పేషన్‌. ఒక్క ఛాన్స్‌ కోసం ఆరాటపడే కళాకారులెందరో. ఖడ్గం సినిమాలో సంగీత పాత్రలో ఆ తృష్ణను కళ్లకు కట్టినట్టు చూపారు దర్శకుడు కృష్ణవంశీ. జీవితంలో ఒక్క సినిమా అయినా తీయాలి. దానిలో వారుండాలి. దానిని చూసిన తమ ఊరివారు కేరింతలు కొట్టాలి. ఆ కేరింతల నడుమ మనముండాలి. ఆ ఊరి మధ్య తరగతి కుటుంబాల్లోని యువకులు చేసిందిదే. మండపేటలోని సత్యశ్రీ థియేటర్‌లో గత జూన్‌ 28న తొలిసారిగా.. ఈనెల 5న మలిసారి ప్రదర్శించారు. సినిమా చూసిన ఏడిద, మండపేట పట్టణం, రూరల్‌ గ్రామాల ప్రజలు కేరింతలు కొట్టారు. తమ ప్రాంత కుర్రాళ్లు, ఇక్కడి లొకేషన్లను వెండి తెరపై చూసి ప్రేక్షకులు ఉప్పొంగిపోయారు. త్వరలో ఆ చిత్రాన్ని యూట్యూబ్‌లో రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.  

కథాంశం ఇదీ.. 
ఓ ఊరిలో వేర్వేరు పద్ధతుల్లో జరిగిన ఏడు హత్యలు.. వాటిలో ఇరుక్కున్న ఇద్దరు సోదరీ, సోదరులు.. ఆ హత్యల వెనుక రహస్యాలను ఛేదించడం ఇదీ వారు తీసిన క్రైం థ్రిల్లర్‌.  

 

సామాన్యులే సినిమా నటులు.. 
మండపేటకు చెందిన మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ ముషిణి పృథ్వీరాజ్‌ హస్థ ప్రొడక్షన్‌ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించి దానిలో ప్రతినాయకుడిగా నటించారు. ఏడిద గ్రామానికి చెందిన సీహెచ్‌ సాయికృష్ణ మండపేటలో టూ వీలర్‌ కన్సల్టెంట్‌. ఆయన ఆ చిత్రానికి కథానాయకుడిగా నటించి దర్శకత్వం, ఎడిటింగ్‌ చేశారు. ఫొటోగ్రాఫర్‌ అవనిగడ్డ సాయిరామ్‌ (కాకినాడ) ఛాయాగ్రాహకుడిగా, ఈవెంట్స్‌ మోడలింగ్‌ చేస్తున్న భవ్యశ్రీ (రాజమహేంద్రవరం) కథానాయకిగా, తిరుమల ప్రకాష్‌ (ఏడిద), మణికంఠ రామ్‌కుమార్, సతీష్‌ అంజిబాబు (మండపేట), సాయి ప్రసాద్, ప్రసాద్, సత్యనారాయణ (కేశవరం), మౌళి (పసలపూడి), ఆర్‌ఎంపీ వైద్యుడు రామకృష్ణ (బడుగువానిలంక), విశ్వేషి ఫణి (తుని) పాత్రోచితంగా నటించారు.  

సన్నివేశాల చిత్రీకరణ ఇలా... 
చిత్రంలోని 60 శాతం సన్నివేశాలను ఏడిదలో, మరో 40 శాతం మండపేట, కడియపులంక పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు.
సమష్టి కృషి 
రెడ్‌ ఫైల్‌ సినిమా థియేటర్‌లో ప్రదర్శించడమనే విజయం వెనుక చిత్ర బృందం సమష్టి విజయంగా భావిస్తున్నాను. జీవితంలో ఆనందాన్ని ఇచ్చింది. 
– ముషిణి పృథ్వీరాజ్, నిర్మాత

ఫలితం వెండితెరపై కనిపించింది 
నటనతో పాటు దర్శకత్వం, ఎడిటింగ్‌ బాధ్యతలతో సినిమా విజయానికి కృషి చేశాను. సమష్టి శ్రమ వెండి తెరపై కనిపించింది. 
– సీహెచ్‌ సాయికృష్ణ, దర్శకుడు, కథానాయకుడు 
ఫొటోగ్రఫీ రిచ్‌గా ఉందన్నారు 
సినిమాలో ఫొటోగ్రఫీ రిచ్‌గా ఉందని ప్రసంసించడం గర్వంగా ఉంది. అవి రెట్టించిన ఉత్సాహాన్ని ఇచ్చాయి.
– అవనిగడ్డ సాయిరామ్, ఫోటోగ్రఫీ. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement