Valimai Movie Review: అజిత్‌ ‘వలిమై’ మూవీ ఎలా ఉందంటే..?

Valimai Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ :వలిమై
నటీనటులు :అజిత్‌, కార్తికేయ, హ్యూమా ఖురేషీ తదితరులు  
నిర్మాణ సంస్థలు : బే వ్యూ ప్రాజెక్ట్స్‌, జి.స్టూడియోస్‌
నిర్మాత: బోనీ క‌పూర్ 
దర్శకత్వం :హెచ్‌.వినోద్‌ 
సంగీతం : యువన్ శంకర్ రాజా 
నేపథ్య సంగీతం: జిబ్రాన్‌
సినిమాటోగ్రఫీ :నీరవ్‌ షా 
విడుదల తేది : ఫిబ్రవరి 24, 2022

దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న చిత్రాలు.. వరుసగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాయి.తాజాగా తమిళ స్టార్‌ హీరో అజిత్‌ నటించిన ‘వలిమై’చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ఇటీవల కాలంలో పెద్ద సినిమాలేవి థియేటర్స్‌లో విడుదల కాకపోవడంతో ‘వలిమై’పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఈ గురువారం(ఫిబ్రవరి 24)ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్‌ పాన్‌ ఇండియా మూవీ ‘వలిమై’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. 

‘వలిమై’కథేటంటే
వైజాగ్‌ కేంద్రంగా ‘సైతాన్‌ స్లేవ్స్‌’పైరుతో నేర సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు నరేన్‌(కార్తికేయ). ఆన్‌లైన్‌ వేదికగా జరిగే ఈ చట్ట విరుద్ద కార్యక్రమానికి నిరుద్యోగ యువతనే టార్గెట్‌గా చేసుకుంటాడు. వారిని డ్రగ్స్‌ బానిసలుగా మార్చేసి, చైన్‌ స్నాచింగ్‌, హత్యలు వంటి చట్ట వ్యతిరేక పనులు చేయిస్తుంటాడు. టెక్నాలజీని ఉపయోగించి పోలీసుల చేతికి చిక్కకుండా జాగ్రత్త పడతాడు. వైజాగ్‌లో రోజు రోజుకి బైక్‌ రేసర్ల దొంగతనాలు, హత్యలు పెరిగిపోవడంతో.. వాటిని అరికట్టడానికి రంగంలోకి దిగుతాడు అసిస్టెంట్‌ కమిషనర్‌  అర్జున్‌(అజిత్‌). ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య జరిగిన పోరులో ఎవరు విజయం సాధించారు? నేరస్తులను పట్టుకునే క్రమంలో అర్జున్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతని ఫ్యామిలీని టార్గెట్‌ చేసిన నరేన్‌కు అర్జున్‌ ఎలా బుద్ది చెప్పాడు? చివరకు ఆన్‌లైన్‌ వేదిక ‘సైతాన్‌ స్లేవ్స్‌’ని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.

ఎవరెలా చేశారంటే
ఏసీపీ అర్జున్‌ పాత్రలో అజిత్‌ ఒదిగిపోయాడు.స్వతగా అజిత్‌ మంచి బైక్‌ రేసర్‌ కావడంతో యాక్షన్స్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించగలిగాడు.ముఖ్యంగా ఇంటర్వెల్‌ ముందు వచ్చే యాక్షన్‌ సీన్స్‌లో అజిత్‌ అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రంతో కోలివుడ్‌ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. విలన్‌గా మెప్పించాడు. యాక్షన్స్‌ సీన్స్‌లో అజిత్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. నార్కొటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ హెడ్‌ సోఫియా పాత్రలో హ్యుమా ఖురేషి జీవించేసింది. సినిమాలో తనది కీలక పాత్ర అనే చెప్పాలి. ఇక ఏసీపీ అర్జున్ తమ్ముడు బుజ్జిగా రాజ్‌ అయ్యప్ప తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే...
వలిమై పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం. డ్రగ్స్‌ సరఫరా, చైన్‌  స్నాచింగ్‌, హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ చుట్టూ కథ సాగుతోంది. ఆన్‌లైన్‌ వేదికగా నేరాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్‌ని, ఆ గ్యాంగ్‌ లీడర్‌ని పోలీసులు ఎలా అంతం చేశారనేదే ఈ సినిమా కథ. రోటీన్‌ కథనే ఎంచుకున్న దర్శకుడు వినోద్‌.. అజిత్‌కి తగ్గట్లుగా భారీ యాక్షన్‌ సీన్స్‌ని, బైక్‌ రేసింగ్‌ నేపథ్యాన్ని తీసుకొని సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు ప్రధాన బలం అజిత్‌, కార్తికేయ మధ్య వచ్చే బైక్‌ ఛేజ్‌ సీన్స్‌, యాక్షన్‌ సన్నివేశాలే. యాక్షన్‌ స్టంట్స్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. అయితే సినిమాలో కొత్తదనం లేకపోవడం, నిడివి ఎక్కువ ఉండడం మైనస్‌.

సినిమా మొత్తం చేసింగ్ సీన్లే ఉంటాయి. మధ్య మధ్యలో మదర్‌ సెంటిమెంట్‌ చొప్పించే ప్రయత్నం​ చేసినా.. అది వర్కౌట్‌ కాలేదు. అంతేకాదు ఫ్యామిలీ సెంటిమెంట్‌  సీన్స్‌ బోరింగ్‌గా అనిపిస్తాయి. ఉన్నంతలో ఫస్టాఫ్‌ అంతో ఇంతో మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్‌ బోరింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌ కూడా పాత సినిమాల మాదిరి ఉంటుంది. ఓ  ఫ్యాక్టరీలో హీరో ఫ్యామిలీని విలన్‌ బంధించి ఉంచడం.. హీరో వచ్చి ఫైట్‌ చేసి వారిని విడిపించడం.. ఇలాంటి క్లైమాక్స్‌ సీన్స్‌ గతంలో చాలా సినిమాల్లో వచ్చాయి. ఎడిటింగ్‌ బాలేదు. పాటలు, నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top