Tollywood: Technicians Who Turned Into Directors, Deets Inside - Sakshi
Sakshi News home page

Tollywood: ఒకప్పుడు టెక్నీషియన్‌.. ఇప్పుడు డైరెక్టర్‌

Published Fri, Jan 21 2022 8:48 AM

Tollywood Technicians Who Tured InTo Dirctors - Sakshi

Technicians Turned Into Directors: విలన్‌ ముఖం మీద హీరో పంచ్‌లు ఇస్తుంటే.. ఫ్యాన్స్‌ విజిల్స్‌ వేస్తారు. హీరో హీరోయిన్‌ డ్యూయట్‌ పాడుకుంటే... ఫ్యాన్స్‌ స్టెప్స్‌ వేస్తారు. విదేశీ అందాలు తెర మీద కనబడితే అదో ఐ ఫీస్ట్‌. ఎక్కువ అయిందనుకున్నప్పుడు సీన్‌ పూర్తయితే అదో రిలీఫ్‌. ప్రేక్షకులకు ఈ అనుభూతులన్నీ కలగాలంటే తెర వెనక ఫైట్‌ మాస్టర్స్, డ్యాన్స్‌ మాస్టర్స్, సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్‌ ఎంతో శ్రమించాలి. ఈ క్రమంలో ఈ టెక్నీషియన్లకు సినిమా డైరెక్షన్‌ మీద ఓ అవగాహన వచ్చేస్తుంది. అందుకే కొందరు డైరెక్టర్లుగా మారతారు. ప్రస్తుతం ‘మెగా ఫోన్‌’ పట్టుకుని దర్శకులుగా స్టార్ట్‌.. కెమెరా, యాక్షన్‌.. కట్‌ చెబుతున్న టెక్నీషియన్ల గురించి తెలుసుకుందాం.

ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డుతో పాటు తమిళనాడు, కేరళ ప్రభుత్వ అవార్డులూ గెలుచుకున్నారు బృందా మాస్టర్‌. ఆమె దర్శకురాలిగా మారారు. దుల్కర్‌ సల్మాన్, కాజల్‌ అగర్వాల్, అదితీ రావు హైదరీ హీరో హీరోయిన్లుగా బృందా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హే సినామిక’. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక యశ్‌ ‘కేజీఎఫ్‌’ చిత్రంలోని యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా మెప్పించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఈ సినిమాలోని స్టంట్స్‌ని అన్బు, అరివు ద్వయం సమకూర్చారు. ఈ చిత్రానికి బెస్ట్‌ స్టంట్‌ మాస్టర్స్‌గా జాతీయ అవార్డు కూడా దక్కించుకున్నారు. ఫైట్‌మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్‌లానే ఈ ఇద్దరు కూడా కవలలే. ఇప్పుడు ఈ ఇద్దరి దర్శకత్వంలో లారెన్స్‌ హీరోగా ‘దుర్గ’ అనే చిత్రం రూపొందనుంది. ఇక కొరియోగ్రాఫర్‌ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా మారి లారెన్స్‌ విజయాలు చవి చూస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.


లారెన్స్‌తో అన్బు, అరివు 

మరోవైపు ‘సీతారాముడు’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘బుర్రకథ’ ‘పీఎస్వీ గరుడవేగ’ వంటి సినిమాలకు వర్క్‌ చేసిన కెమెరామేన్‌ అంజి కూడా రీసెంట్‌గా దర్శకుడిగా మారారు. శ్రీరామ్, అవికా గౌర్‌ హీరో హీరోయిన్లుగా నటించనున్న ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ సినిమాకు అంజి దర్శకుడు. పి. అచ్యుత్‌ రామారావు, రవితేజ మన్యం ఈ సినిమాను నిర్మించనున్నారు. సునీల్, ధన్‌రాజ్‌ హీరోలుగా రిలీజ్‌కు రెడీ అయిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘బుజ్జీ.. ఇలారా’కి కూడా అంజియే దర్శకుడు. నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక 2016లో వచ్చిన ‘క్షణం’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు గ్యారీ. 2018లో వచ్చిన ‘గూఢచారి’తో గ్యారీ ఎడిటర్‌గా మారారు. ఆ తర్వాత ‘ఎవరు’, ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’ ఇటీవల ‘ఇచట వాహ నములు నిలుపరాదు’ .. ఇలా దాదాపు 20కి పైగా సినిమాలకు ఎడిటర్‌గా చేసిన ఆయన ఇప్పుడు దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టారు. నిఖిల్‌ హీరోగా దేశభక్తి నేపథ్యంలో ఓ స్పై థ్రిల్లర్‌ మూవీని గ్యారీ డైరెక్ట్‌ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రాజశేఖర రెడ్డి నిర్మించనున్నారు. మరికొందరు సాంకేతిక నిపుణులు కూడా తమలోని దర్శకత్వ ప్రతిభను వెండితెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు.

ఛాయాగ్రాహకుడిగా సంతోష్‌ శివన్‌కి ఎంత మంచి గుర్తింపు ఉందో తెలిసిందే. కెమెరామేన్‌గా నాలుగు జాతీయ అవార్డులు సాధించిన ఆయన డైరెక్టర్‌గాను (ది టెర్రరిస్టు, మల్లి, నవరస చిత్రాలకు) జాతీయ అవార్డులు సాధించారు. ఇప్పుడు సంతోష్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ముంబైకర్‌’. విజయ్‌ సేతుపతి, విక్రాంత్‌ మెస్సీ ప్రధాన పాత్రధారులు. తమిళ హిట్‌ మూవీ ‘మానగరం’కు హిందీ రీమేక్‌గా ‘ముంబైకర్‌’ రూపొందుతోందని టాక్‌.


‘దిల్‌ చాహ్‌ తా హై’, ‘కోయీ మిల్‌ గయా’, ‘ఫనా’, ‘గజిని’ ఇలా ఎన్నో హిట్‌ సినిమాలకు కెమెరామ్యాన్‌గా చేసిన రవి కె. చంద్రన్‌ ప్రస్తుతం ‘తామర’ అనే ఇండో–ఫ్రెంచ్‌ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. తెలుగులో అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇదిలా ఉంటే.. 1992 నుంచి కెమెరామేన్‌గా కొనసాగుతున్న రవి. కె. చంద్రన్‌ పాతికేళ్లకు తెలుగు సినిమా చేయడం విశేషం. 2018లో మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘భరత్‌ అనే నేను’ ఛాయాగ్రాహకుడిగా రవి కె. చంద్రన్‌కు తెలుగులో తొలి సినిమా. అలాగే తెలుగు నిర్మాణ సంస్థలో దర్శకుడిగా ‘తామర’ రవికి తొలి చిత్రం అయినప్పటికీ  తమిళంలో ‘యాన్‌’ (2014), మలయాళంలో ‘భ్రమమ్‌’ (2021) చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement