కీలక పాత్రల్లో నటిస్తున్న కథానాయికలు
ఈ తరం హీరోయిన్స్ సూపర్ స్మార్ట్. కేవలం కమర్షియల్ హీరోయిన్ అంటూ ఒకే జానర్‌కు పరిమితం కావాలనుకోవడం లేదు. యాక్షన్ సినిమాలకూ సై అంటున్నారు. ఉమెన్ సెంట్రిక్ సినిమాల సవాళ్లను స్వీకరిస్తున్నారు. ఇప్పుడు కథలో కీలక పాత్రలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలా ఆల్రెడీ ఓ హీరోయిన్ ఉన్న సినిమాలో, కీలక పాత్రలు చేసేందుకు రెడీ అవుతున్న కొంతమంది హీరోయిన్ల గురించి ఓ లుక్ వేద్దాం.
పవర్‌ఫుల్ రోల్
కథ నచ్చితే చాలు... హీరోయినా? లేక కీ రోలా? అని అస్సలు ఆలోచించరు శ్రుతీహాసన్. ఒకవైపు ప్రభాస్ ‘సలార్’ వంటి భారీ సినిమాలో హీరోయిన్‌గా చేశారు శ్రుతీహాసన్. ‘సలార్ 2’ చిత్రీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో ఇద్దరు చెల్లెళ్లు ఉన్న అక్క పాత్రలో శ్రుతీహాసన్ నటించారు. ఇప్పుడు మరోసారి మరో బలమైన కథలో పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారీ బ్యూటీ.
అది ఏ సినిమా అంటే... ‘ఆకాశంలో ఒక తార’ అన్నమాట. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలోనే శ్రుతీహాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వ΄్నా సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేసి, ఈ ఏడాదే ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
రాయ సిస్టర్ గంగ?
చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు నయనతార. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలకృష్ణ కొత్త సినిమాలోనూ నయనతార హీరోయిన్‌గా ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారు. ఇలా హీరోయిన్‌గా వరుస అవకాశాలు లభిస్తున్నప్పటికీ నయనతార కథకు కీలకమైన ఓ కీ రోల్ చేశారు. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2’ వంటి చిత్రాల తర్వాత యశ్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘టాక్సిక్’. గోవా నేపథ్యంలో 1940–1970 కాలమానంలో సాగే పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది.
ఈ చిత్రంలో రాయ, టికెట్... ఇలా ద్వి పాత్రాభినయం చేస్తున్నారు యశ్. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామాయే అయినప్పటికీ కథ ప్రధానంగా తండ్రీకొడుకుల మధ్య సాగే రివెంజ్ డ్రామా నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. ఈ కథలోనే రాయ పాత్రకు సిస్టర్ గంగ పాత్రలో నయనతార నటిస్తున్నారని తెలిసింది. కథకు ఎంతో కీలకమైన పాత్ర ఇది. ఇక ఈ సినిమాలోని మెయిన్ హీరోయిన్స్‌గా రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ నటిస్తున్నారని తెలిసింది. మెలిస్సాగా రుక్మిణీ వసంత్, నాడియాగా కియారా అద్వానీ, రెబెక్కాగా తారా సుతారియా, ఎలిజెబెత్‌గా హ్యూమా ఖురేషీ నటిస్తున్నారు. మాన్‌స్టర్ మైండ్స్, కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.
రాకాలో రష్మిక
‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న తాజా సినిమా ‘రాకా’. ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ సినిమాల్లో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మికా మందన్నా నటించారు. అయితే ‘రాకా’లోనూ రష్మికా మందన్నా ఉన్నారని తెలిసింది. కానీ ఆమెది హీరోయిన్ రోల్ కాదని, నెగటివ్ షేడ్స్ ఉండే విలన్ రోల్ అని తెలిసింది. కమర్షియల్ సినిమా హీరోయిన్‌గా సూపర్ హిట్ అయిన రష్మికా మందన్నా, ఇటీవల ‘ది గాళ్‌ఫ్రెండ్’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లోనూ లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు విలన్ రోల్‌లో తన సత్తా ఏంటో చూపించేందుకు రష్మికా మందన్నా రెడీ అవుతున్నట్లుగా తెలిసింది.
ఆల్రెడీ రష్మిక ‘రాకా’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారని తెలిసింది. ‘రాకా’ చిత్రీకరణ ఎక్కువగా ముంబైలో జరుగుతోంది. ఫిబ్రవరి నెల స్టార్టింగ్‌లో ముంబైలో జరిగిన ఈ సినిమా షూట్‌లో రష్మిక పాల్గొన్నారని, ఆమెపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. మరి... రష్మికా మందన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తుంటే హీరోయిన్ ఎవరు? అనే డౌట్ రావొచ్చు. కథ రీత్యా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. రష్మికా మందన్నా నెగటివ్ రోల్ చేస్తుండగా, మరో కీలక పాత్రలో దీపికా పదుకోన్ కనిపిస్తారు. ఈ సినిమాలో దీపికా పదుకోన్ భాగమైన విషయాన్ని ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. హీరోయిన్స్‌గా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కనిపిస్తారని సమాచారం.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారిగా ట్రిపుల్ రోల్స్ చేస్తున్నారని, ఇందులో తండ్రి, ఇద్దరు అన్నదమ్ముల పాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారని తెలిసింది. అంతేకాదు... ఈ సినిమాలో ఓ విలన్‌గా కూడా అల్లు అర్జున్ కనిపిస్తారట. ఈ చిత్రానికి పునర్జన్మల కాన్సెప్ట్ ఉంటుందని, ఆడియన్స్‌ను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లేలా ఈ చిత్రదర్శకుడు అట్లీ కథ తయారు చేశారని తెలిసింది. భారీ వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ ఉండటం, పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం.. వంటి కారణాల చేత ‘రాకా’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుందని, షూటింగ్ మాత్రం ఈ ఏడాదే పూర్తి అవుతుందని తెలిసింది. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
సంబరాల్లో...
తెలుగుతెరపై హీరోయిన్‌గా ‘మల్లేశం, పొట్టేల్’ వంటి చిత్రాలతో సక్సెస్ అయ్యారు హీరోయిన్ అనన్య నాగళ్ల. కానీ కుదిరినప్పుడల్లా కీలక పాత్రలూ చేస్తున్నారామె. ‘డార్లింగ్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు అనన్య. తాజాగా సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, సంజయ్ దత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య దాదాపు రూ. 120 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం కూడా సాగుతోంది.
కాకాజీ కుమార్తెగా?
‘వాల్తేరు వీరయ్య’ వంటి సక్సెస్‌ఫుల్ సినిమా తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘కాకాజీ’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ్ర పారంభం కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఇంకా స్టార్ట్ కాలేదు. అతి త్వరలోనే ఆరంభమవుతుంది. ఈ సినిమాలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి, చిరంజీవి కుమార్తె పాత్రలో అనశ్వర రాజన్ నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.
గత ఏడాది డిసెంబరులో విడుదలైన రోషన్ మేక ‘ఛాంపియన్’ చిత్రంతో తెలుగులోకి వచ్చారు అనశ్వర రాజన్. ఆమె హీరోయిన్‌గా ఇటీవల వచ్చిన ‘విత్ లవ్’ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇంకా అనశ్వర హీరోయిన్‌గా నటించిన ‘ఇట్లు అర్జున, 7/జీ బృందావన కాలనీ 2’ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. ఇలా హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్న అనస్వర ‘కాకాజీ ’ చిత్రంలో కథకు కీలకమైన కుమార్తె పాత్రలో నటించనుండటం విశేషం. ఈ సినిమా వచ్చే ఏడాది ్ర పారంభంలో రిలీజ్ కానుందని సమా చారం.
ఇలా కథను మలుపు తిప్పే కీలక పాత్రల్లో ప్రముఖ హీరోయిన్స్ నటిస్తున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. మరికొంతమంది హీరోయిన్స్ కథకు కీలకమైన పాత్రల్లో నటించేందుకు సిద్ధం అవుతున్నారు.
– ముసిమి శివాంజనేయులు


